దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తుంది. కన్నడ సినిమాకు ఇదివరకు ఎప్పుడూ లేనంత రికార్డుల వర్షం కురిపించింది ఈ చిత్రం. పునీత్ చివరి సినిమా కావడంతో థియేటర్స్ పోటెత్తారు ప్రేక్షకులు. ముఖ్యంగా అభిమానులు అయితే ముందు రోజు రాత్రి నుంచి పండగ చేసుకున్నారు. ఆయన్ని చివరి సారి స్క్రీన్ మీద చూడాలని గంటల పాటు థియేటర్స్ ముందు క్యూ కట్టారు.
ఇప్పుడు ఈ ఎదురు చూపులన్నీ జేమ్స్ బాక్సాఫీస్ కలెక్షన్ రూపంలో బయటికి వచ్చాయి. ఈ సినిమా కేవలం కర్ణాటకలోనే మొదటి 5 రోజుల్లో 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రతీరోజు అదిరిపోయే వసూళ్లు తీసుకొస్తుంది జేమ్స్. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీలో కెజిఎఫ్: చాప్టర్ 1 పేరు మీదున్న రికార్డులను ఇప్పుడు జేమ్స్ తుడిచి పెట్టేసింది.
జేమ్స్ సినిమాను కేవలం కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా చూస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఇది సినిమా కంటే కూడా ఫ్యాన్స్‌కి ఎమోషన్. ఈ సినిమా అపూర్వ విజయం సాధించడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి 5 రోజుల్లో 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
అప్పు లేడన్న బాధ ఓ వైపు కలిచి వేస్తున్నా.. మరోవైపు ఆయన చివరి సినిమా చూస్తున్నాం అనే ఆనందం కూడా వాళ్లలో కనిపిస్తుంది. చేతన్ కుమార్ 'జేమ్స్' చిత్రానికి దర్శకత్వం వహించాడు. పునీత్ రాజ్ కుమార్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది. రాజకుమార లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా ఇది.
కిషోర్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యధిక బడ్జెట్‌తో నిర్మించారు. మొదటి 4 రోజులు కూడా అన్నిచోట్లా హౌస్ ఫుల్ అయింది. మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్లు బుక్ అయిపోయాయి. మరోవైపు ఐదో రోజు కూడా చాలా చోట్ల సినిమాకు మంచి వసూళ్లనే వచ్చాయి. కేజియఫ్ తర్వాత 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాగా జేమ్స్ చరిత్ర సృష్టించింది.
పునీత్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆ విషయంలో అభిమానుల అంచనాలను చేరుకోవడంలో జేమ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన్ని చివరిసారిగా పునీత్‌ని హీరోగా చూడడం ప్రేక్షకులందరినీ వెంటాడుతోంది. శివరాజ్ కుమార్ కూడా మైసూర్ లో సినిమా చూసి ఎమోషనల్ అయ్యాడు. బెంగళూరులోని వీరేష్ సినిమా థియేటర్లో ఫస్ట్ డే షో చూసాడు మరో అన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్.