ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాల రిలీజ్, థియేటర్ల కేటాయింపు విషయమై నిర్మాతల మండలి అధ్యక్షుడు, బడా నిర్మాత సీ. కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తమిళ, కన్నడ చిత్రసీమలో వాళ్ళ సినిమాలకే ప్రియార్టీ ఇచ్చినప్పుడు తెలుగు పరిశ్రమలో కూడా తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా వాల్తేరు వీరయ్య. అలాగే బాలకృష్ణ చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ వీర సింహా రెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉన్నాయి. అయితే ఈ సంక్రాంతికి పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ రెండు చిత్రాలకు థియేటర్లు లేకపోవడం సహించరాని విషయం అని సీ. కళ్యాణ్ అన్నారు.
ఇదే సంక్రాంతికి రాబోతున్న విజయ్ వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో సి కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. విజయ్ వారసుడు సినిమా విషయంలో దిల్ రాజును తప్పు పట్టడం సరికాదని చెప్పిన సి కళ్యాణ్.. ఈ విషయంలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే నియమ నిబంధనకు కట్టుబడి ఉన్నట్లుగా దిల్ రాజు తెలియ జేయాలని కోరారు.
చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.