మాట్లాడితే ‘మేమంతా ఒక్కటే.. మాకు మాకు ఎలాంటి గొడవల్లేవు.. ఒకటే కుటుంబం.. వసుదైక కుటుంబం.. అందరం కలిసే ఉంటాం.. ఎన్నికల వరకే ఈ రచ్చ అంతా’ అంటూ కబుర్లు చెప్తుంటారు. అయితే సినిమాల్లో నటించి నటించి బయట కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు మా సభ్యులు. మరీ ముఖ్యంగా తామేం మాట్లాడుతున్నామో కూడా తెలియనంతగా మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
మొన్నటి వరకు బండ బూతులు తిట్టుకుని.. ఎన్నికల తర్వాత మళ్లీ కౌగిలించుకున్న వీళ్లను చూసి బయట కామన్ ఆడియన్స్ కూడా విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతీసారి మా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్లు చేసుకునేవాళ్ళు. గెలిచిన వాళ్లు సంబరాలు చేసుకుంటుంటే.. ఓడిన వాళ్లు మాత్రం ఎందుకలా జరిగిందో విశ్లేషించుకునేవాళ్లు. కానీ ఈ సారి మాత్రం అలా కాదు.
ప్రకాష్ రాజ్‌ను నాన్ లోకల్ అనే నినాదంతోనే తిప్పి కొట్టి మంచు విష్ణు వర్గం గెలిచింది. తాను ఓడిపోయిన దానికంటే కూడా నాన్ లోకల్ అనే పదాన్ని ఎక్కువగా మనసుకు తీసుకున్నాడు ప్రకాష్. ఇలాంటి సంకుచిత భావాలు ఉన్న అసోసియేషన్‌లో తాను పని చేయలేనంటూ రాజీనామా కూడా చేసాడు. ఇప్పుడు ఓటమి తర్వాత సైలెంట్ అయిపోతాడేమో అనుకుంటే.. అంత కంటే అనూహ్య నిర్ణయంతో బయటికి వచ్చాడు ప్రకాష్ రాజ్.
ఇప్పటి వరకు ఎన్ని గొడవలు పడినా కూడా ఒక్కటిగా ఉన్న మా అసోసియేషన్.. ఇప్పుడు రెండు ముక్కలయ్యేలా కనిపిస్తుంది. ఎన్నికలు ముగిసినా కూడా అభిప్రాయ భేదాలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. ఇవి ఇంకా సద్దుమణగలేదేమో అనిపిస్తుంది ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే. ప్రకాష్ రాజ్ ప్యానెల్లో గెలిచిన సభ్యులూ ‘మా’అసోసియేషన్‌ని వీడతారని.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రచారం మొదలైంది.
‘మా’కు పోటీగా మరో అసోసియేషన్ ఏర్పాటు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఆత్మా) అనే పేరు కూడా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో ప్రాంతీయ వర్గ బేధాలు ఉండవని తెలుస్తుంది. తెలుగు నటీనటులు ఉన్న అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా తెలుగువాడినే ఎన్నుకోవాలని పలువురు నటులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
దీనిపై ప్రకాష్ రాజ్ కూడా కూడా పలు వేదికల మీద స్పందించారు. తాను తెలుగు వాడిని కాకపోవటం దురదృష్టకరమని తెలిపారు. తన తల్లిదండ్రులు తెలుగువాళ్లు కాకపోవటం తన తప్పా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. దీంతో ప్రాంతీయవాదం ఉన్న ‘మా’లో తాము కొనసాగలేమని అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి సినీ నటుడు నాగబాబుతో పాటు ప్రకాష్ రాజ్ కూడా రాజీనామా చేసారు.
ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ (ఉపాధ్యక్షుడు), శ్రీకాంత్ (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), ఉత్తేజ్ (జాయింట్ సెక్రటరీ).. ఈసీ మెంబర్లుగా శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేశ్ కొండేటి, సమీర్, సుడిగాలి సుధీర్, కౌశిక్ విజయం సాధించారు.