ఇక్కడ పీకే అంటే మన పవన్ కల్యాణ్ కాదండీ బాబూ.. ఆయనే ఓడిపోయాడు మళ్లీ ఆయన సాయం ఎవరు తీసుకుంటారనే అనుమానాలు వచ్చేస్తాయి మళ్లీ. ఇక్కడ పీకే అంటే ప్రశాంత్ కిశోర్.. దేశ రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్లకు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల వ్యూహ రచనల్లో చాణుక్యుడిగా పేరుంది ఈయనకు. మన దగ్గర కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది.. ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.
ముఖ్యంగా మూడేళ్ల కింద ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల ముందు నాటి ప్రతిపక్ష వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ కిశోర్.. వైసీపీ భారీ మెజార్టీతో గెలవడంలో కీలక భూమిక పోషించారు. ఆ పార్టీ ఎన్నికల హామీలైన నవరత్నాలతో పాటు అభ్యర్థుల ఎంపిక వరకు ప్రశాంత్ కిశోర్ కీలక భూమిక పోషించారు. దానికిముందే 2014 ఎన్నికల సమయంలో కూడా మోదీ కోసం చాలా వ్యూహాలను రచించారు ప్రశాంత్ కిషోర్.
తాజాగా ఆయన తెలంగాణ కోసం కూడా పని చేస్తున్నాడు. ఆ మధ్య మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోసం పని చేస్తాడనే వార్తలు వచ్చినా కూడా.. వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు అదే తమిళనాడులోని సూపర్ స్టార్ విజయ్ కోసం ప్రశాంత్ కిషోర్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్యే ఓ సర్వేలో రజినీకాంత్ కంటే ప్రజలు మరో సూపర్ స్టార్ విజయ్ వైపే మొగ్గు చూపిస్తున్నారంటూ పీకే సర్వేలో తేలిందని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆ స్టార్ హీరోకు ఆయన స్వయంగా కలిసి వివరించాడని.. త్వరగా రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా మీరే ముఖ్యమంత్రి అవుతారని విజయ్‌కు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ విజయ్ మాత్రం చాలా రోజులుగా పాలిటిక్స్‌లోకి వస్తానని చెబుతున్నా కూడా ఎప్పుడొస్తాడనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
మొన్న హైదరాబాద్‌లో విజయ్, ప్రశాంత్ రహస్యంగా కలిసారని తెలుస్తుంది. ఇందులో రాజకీయాల గురించే ఎక్కువగా చర్చకు వచ్చిందని.. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం కూడా బయటికి రానుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ సన్నిహితుడు ఒకరు మాట్లాడుతూ.. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిందని.. ఆ పార్టీకి రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉందనే విషయం అందరికీ తెలిసిందే అని చెప్పాడు.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే నాయకత్వ లోపంతో సతమతం అవుతోందని ఆయన తెలిపారు. అయితే కరుణానిధిపై ధ్వేషం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ భవిష్యత్తు ఏంటోనని అన్నాడీఎంకే నేతలు కలతచెందుతున్నట్లు అసలు విషయం బయటకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో విజయ్ పార్టీ పెడితే అన్నాడీఎంకే శ్రేణులు కొత్త పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆ మధ్య రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేసి మళ్లీ క్యాన్సిల్ చేయడంతో చాలా మంది ఎటూ కాకుండా పోయారు.
ఇలాంటి సమయంలో విజయ్ పార్టీ పెడితే కచ్చితంగా ఫలితం ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ కూడా విజయ్‌కు చెప్పినట్లు తెలుస్తుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ నాయకత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనేది అందరూ అనుకుంటున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్‌ను విజయ్ కలుసుకున్నారని ప్రచారం జరుగుతుంది. మక్కల్ ఇయక్కం కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా గమనిస్తున్నట్లు తమిళనాట వార్తలొస్తున్నాయి.