పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న భీమ్లా నాయక్ సినిమాతో వచ్చిన ఈయన.. ఇదే ఏడాది హరిహర వీరమల్లు సినిమాను కూడా విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం 100 కోట్లతో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదల కానుంది హరిహర వీరమల్లు. దీని తర్వాత మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి.
హరీష్ శంకర్ ఇప్పటికే భవదీయుడు భగత్ సింగ్ కథ సిద్ధం చేసి.. షూటింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ 60 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది. మరోవైపు తమిళ సినిమా వినోదాయ సితం రీమేక్ కూడా చేయబోతున్నాడు పవన్. ఇందులో సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది.
మార్చ్ 25న సినిమా ఓపెనింగ్ కూడా జరగనుందని తెలుస్తుంది. సముద్రఖని దర్శకుడు. మరోవైపు వీటన్నింటితో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్లోనే ఉంది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు అయినా రామ్ తళ్లూరి నిర్మించబోతున్నాడు. వక్కంతం వంశీ ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. తాజాగా దీనిపై ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇందులో కేవలం పవన్ మాత్రమే కాదు.. మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఆయనెవరో కాదు.. మాస్ రాజా రవితేజ. అవును.. ఈ సినిమాలో రవితేజ మరో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ విక్రమ్ వేధకు రీమేక్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తిగా అదే కథ కాకుండా.. కేవలం లైన్ మాత్రమే తీసుకుని తెలుగులో పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు కథను కంప్లీట్‌గా మార్చేస్తున్నారని తెలుస్తుంది.
దీనికోసం సురేందర్ రెడ్డితో పాటు వక్కంతం వంశీ కూడా చాలా వర్క్ చేస్తున్నారని.. మాధవన్ పాత్రకు పవన్.. విజయ్ సేతుపతి పాత్రకు రవితేజను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. మూడేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం తమిళంలో భారీ విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రీమేక్ గురించి చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు వర్కవుట్ కాలేదు.
ఇదే సినిమాను తెలుగులో పవన్, సురేందర్ రెడ్డి రీమేక్ చేయబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది కానీ దీనిపై మాత్రం క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో అయితే దీని గురించి చర్చ బాగానే జరుగుతుంది. మరి ఒకవేళ అన్నీ కుదిరి ఇది ఆ రీమేకే అయితే మాత్రం పవన్ పాత్రను చాలా వరకు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తమిళంలో మాధవన్ కంటే విజయ్ సేతుపతి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండటమే కాకుండా.. ఎలివేషన్స్ ఉంటాయి.