పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుందంటే ఆ వైబ్రేషన్స్ మరోలా ఉంటాయి. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఇదే జరుగుతుంది. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుండటంతో పవన్ అభిమానులు కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు. ఫిబ్రవరి 25 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే భీమ్లా నాయక్ సినిమాకు వచ్చే వసూళ్లను బట్టి వచ్చే సినిమాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది.
కరోనా మూడో దశ తగ్గుతున్న వేళ విడుదలవుతున్న తొలి భారీ సినిమా ఇదే. బంగార్రాజు వచ్చినా.. దాని బిజినెస్ తక్కువే. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘అయ్యప్పునుమ్ కోశియుమ్’ చిత్రాన్నితెలుగులో రీమేక్ చేస్తుండటం.. ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ కావడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. పైగా పవన్ కళ్యాణ్ కోసం తెలుగులో కొన్ని మార్పులు కూడా చేసాడు దర్శకుడు త్రివిక్రమ్. సాగర్ కే చంద్ర దీనికి దర్శకుడు అయినా కూడా వెనకుండి నడిపించింది మాత్రం మాటల మాంత్రికుడే. అందుకే ఈ చిత్రంపై అన్ని అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా విడుదల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అభిమానులు. పవన్ వస్తుండటంతో మరే ఇతర సినిమాను కూడా తెలుగులో విడుదల చేయడం లేదు. అయితే హిందీ నుంచి గంగూభాయ్ కతవాడియా, తమిళం నుంచి వాలిమై మాత్రం భీమ్లా నాయక్‌కు పోటీగా వస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దాదాపు 2500 స్క్రీన్స్‌లో విడుదల కానుంది.
మరోవైపు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులే ఏకంగా రూ.70 కోట్ల వరకు అమ్ముడుపోయాయన్న వార్తలు వస్తున్నాయి. ఓటిటి కూడా భారీ రేటు పలికింది. పైగా ఒక్కటి కాదు.. రెండు ఓటిటి సంస్థలు భీమ్లా నాయక్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో పాటు ఆహాలోనూ విడుదల కానుంది భీమ్లా నాయక్. తెలుగు రైట్స్ ఆహాకు వెళ్తే.. హిందీ రైట్స్ హాట్ స్టార్ తీసుకుందని తెలుస్తుంది. దాంతో ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే చర్చ మొదలైంది.
సాధారణంగా ఈ రోజుల్లో పెద్ద సినిమాలైనా కూడా విడుదలైన 30 రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇదే జరుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాతలు మాత్రం ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదలైన నాలుగు వారాల్లోపే భీమ్లా నాయక్ ఓటిటిలో వచ్చేస్తుందని ప్రచారం జరుగుతుంది.
అలా కాని పక్షంలో ఎప్రిల్ 15 వరకు వేచి చూడాల్సిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 110 కోట్ల థియెట్రికల్ బిజినెస్ చేస్తున్న భీమ్లా నాయక్.. డిజిటల్, శాటిలైట్ అన్నీ కలిపి 200 కోట్లు దాటిపోయింది.