ప్రభాస్ ప్రస్తుతం అరడజన్ సినిమాలు చేస్తున్నాడు. ఈయన ఉన్నంత బిజీగా ఇండస్ట్రీలో మరే హీరో లేడు కూడా. ప్రస్తుతం 20వ సినిమా చేస్తున్న ప్రభాస్.. అప్పుడే 25వ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసాడు. ఈయన మైల్ స్టోన్ సినిమా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్నాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు కూడా ప్రభాస్ సైన్ చేసాడని ప్రచారం జరుగుతుంది.
కొన్నేళ్లుగా కేవలం యాక్షన్ డ్రామాలతోనే ప్రయాణం చేస్తున్న ప్రభాస్.. చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. నిజానికి మిర్చి నుంచి వరసగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు ప్రభాస్. దర్శకులు కూడా ఆయనలోని యాక్షన్ యాంగిల్నే ఎక్కువగా వాడుకుంటున్నారు. రాధే శ్యామ్ లవ్ స్టోరీ అయినా కూడా అందులోనూ యాక్షన్ ఉందని ట్రైలర్ చూస్తుంటనే అర్థమైపోతుంది. అందుకే పూర్తిగా ఓ సరదా సినిమా చేయాలనుకుంటున్నాడు ప్రభాస్.
దీనికోసం యువ దర్శకుడు మారతిని నమ్ముకుంటున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల కింద ఈయన చిరంజీవికి ఓ కథ చెప్పాడు. ఆ తర్వాత అది అల్లు అర్జున్ దగ్గరికి కూడా వెళ్లొచ్చింది. ఈ ఇద్దరు మెగా హీరోలకు నచ్చని ఒక కథ ప్రభాస్‌కు నచ్చిందని తెలుస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాజా డీలక్స్ అనే ఒక సినిమా రాబోతోందని ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
అధికారిక ప్రకటన రాకపోయినా.. ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న మారుతి.. ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. అంతేకాదు.. ప్రభాస్ సినిమా అంటే కనీసం 200 కోట్లు బడ్జెట్ ఖాయం అనుకుంటున్న తరుణంలో.. రాజా డీలక్స్ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్లో.. చాలా తక్కువ సమయంలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ జోనర్ ట్రై చేయబోతున్నాడు. ప్రభాస్ పారితోషకం పక్కన పెడితే ఈ సినిమా 50 కోట్లలోపు పూర్తవుతుందని తెలుస్తుంది. రాజా డీలక్స్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్‌లోనే రానుందని.. పైగా ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.
అవసరం అనుకుంటే ముందు కమిటైన సినిమాల డేట్స్ కొన్ని రోజులు ఆపి.. ముందు రాజా డీలక్స్ పూర్తి చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆరు నెలల్లో సినిమా విడుదల చేయాలని మారుతి కూడా గట్టి ప్లాన్ వేసుకుంటున్నాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లాంటి సినిమాల్లో ప్రభాస్ చేసిన కామెడీ సూపర్‌గా వర్కవుట్ అయింది. కానీ సినిమాలే హిట్ అవ్వలేదు. కానీ మారుతి సినిమాతో హిట్ కొట్టాలనే కసితో కనిపిస్తున్నాడు రెబల్ స్టార్.