ఓ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నపుడే కచ్చితంగా దానిమీద ఓ అవగాహన అయితే వచ్చేస్తుంది. దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా ఈ సినిమా వర్కవుట్ అవుతుందా కాదా అనేది అంచనా వేస్తారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఔట్ పుట్ చూసుకుంటే అది ఫ్లాప్ అవుతుందని ముందే తెలిసిపోతుంది. దానికి సిద్ధపడి ఉంటారు దర్శక నిర్మాతలు.. హీరో కూడా. కొన్నిసార్లు మాత్రం అంచనాలు తప్పి బాగాలేదుకున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుంటాయి.
అలాంటి సమయంలో కోదండరామి రెడ్డి దర్శకత్వంలో అన్నగారు ఓకే చేసిన కథతో బాలయ్య హీరోగా వచ్చిన అనసూయమ్మ గారి అల్లుడు బ్లాక్ బస్టర్ అయింది. అదే నమ్మకంతో మరో సినిమా కూడా బాలయ్యతో చేయాలని కోదండరామి రెడ్డిని అడగ్గా.. అయ్యో ఎంతమాట అని ఓకే అనేసాడు. అయితే ఆయన సెలెక్ట్ చేసుకున్న కథ దర్శకుడు కోదండరామిరెడ్డికి అస్సలు నచ్చలేదు.
దాంతో అన్నగారికి కథ నచ్చలేదని.. ఇది చేస్తే ఫ్లాప్ అవుతుందని మొహం మీదే చెప్పేసాడు దర్శకుడు. మీకు నచ్చనపుడు సినిమా నేనెందుకు చేయమంటాను అంటూ ఎన్టీఆర్ కూడా సైలెంట్ అయిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఎందుకో తెలియదు కానీ ఆ కథతోనే సినిమా చేయాలంటూ చెప్పాకా.. ఇకతప్పదని సినిమా చేసాడు కోదండరామి రెడ్డి. అలా పురుడు పోసుకుంది తిరగబడ్డ తెలుగుబిడ్డ.
ఈ సినిమా కథ బాలయ్యకు కూడా నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో కోదండరామి రెడ్డి చెప్పాడు. అన్నఎన్టీఆర్ గారికి ఎదురు చెప్పలేని పరిస్థితి. ఇద్దరూ అయిష్టంగానే ఈ సినిమాను పూర్తి చేసారు. షూటింగ్ సమయంలో కూడా ఓ సీన్ కోసం రెండో టేక్ అడగ్గా.. ఫ్లాప్ అయ్యే సినిమాకు ఎందుకు రెండో టేక్ అంటూ బాలయ్య కూడా అనాసక్తి చూపించాడని చెప్పాడు దర్శకుడు.
అనుకున్నట్లుగానే ఈ చిత్రం విడుదలవ్వడం.. డిజాస్టర్ అవ్వడం జరిగిపోయాయి. అయితే ఈ సినిమాలోనే బాలయ్య మొదటిసారి బ్రేక్ డాన్స్ చేసాడు. అలా యిష్టం లేకుండా అన్నగారి మాట కోసం బాలయ్య, కోదండరామిరెడ్డి ఓ సినిమా చేసారన్నమాట. ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్గా నటించింది. జీవిత చెల్లెలు పాత్రలో నటించింది. మొత్తంగా అప్పట్లోనే బాలయ్య కథల విషయంలో జడ్జిమెంట్ ఎలా ఉండేదో అర్ధమవుతోంది.