ఒకప్పుడు నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమాలో కూడా కొత్తదనం ఉండేలా చూసుకునేవాడు. ఆ తర్వాత మెల్లగా అతను కూడా అందరిలాంటి రొటీన్ కమర్షియల్ సినిమాలకు అలవాట పడిపోయాడు. మార్కెట్ పెరిగే కొద్దీ రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఓ సమయంలో నాని ఏంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నాడనే విమర్శలు కూడా అందుకున్నాడు ఈయన. అయితే మధ్యలో కొన్నిసార్లు రొటీన్‌కు దూరంగా వెళ్లి కొత్తదనం కోసం ప్రయత్నించాడు.
కానీ ఫలితం తేడాగా రావడంతో మళ్లీ రొటీన్ రూట్లోనే సినిమాలు చేసాడు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ యంగ్ హీరోలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తాను చేసే ప్రతీ సినిమాలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు నాని. భారీ అంచనాల మధ్య వచ్చిన వి, టక్ జగదీష్ సినిమాలు దారుణంగా నిరాశ పరచడంతో.. రాబోయే కథలు, చేస్తున్న కథలు కొత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే మొన్న విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. మొదటి పాత్ర మామూలుగానే ఉన్నా.. టైటిల్ రోల్ మాత్రం పీరియాడిక్ కారెక్టర్. ఒక ప్రముఖ రచయితగా నటించి మెప్పించాడు. ఈ రెండు పాత్రల్లోనూ నాని నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు అంటే సుందరానికి సినిమాలోనూ కొత్తగానే కనిపిస్తున్నాడు నాని. ఇప్పటి వరకు ఈయన చేయని పాత్ర ఇది.
ఇందులో ఒక బ్రహ్మణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు నాని. దీనికి సంబంధించిన టీజర్ మొన్న విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది సినిమా. జూన్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. బ్రహ్మణ యువకుడి కష్టాలను నాని చాలా ఫన్నీగా చూపించబోతున్నాడు.