అది సెప్టెంబర్ 5.. 2008.. ఆ రోజు ఓ చిన్న సినిమా విడుదలైంది. అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అంత చిన్న సినిమా కాబట్టి. కలర్స్ స్వాతి తప్ప మరో ఫేస్ కూడా ఆ సినిమాలో ఎవరున్నారో తెలియదు. కానీ విడుదలైన తర్వాత సంచలన విజయం సాధించి ఆ కుర్రాన్ని అందరికీ పరిచయం చేసింది ఆ చిత్రం. ఆ కుర్రాడే మనం ఇప్పుడు ముద్దుగా న్యాచురల్ స్టార్ అని పిలుచుకుంటున్న నాని.. ఆ సినిమా ‘అష్టాచమ్మా’.
ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంతోనే ఇండస్ట్రీకి వచ్చాడు నాని. సరిగ్గా 13 ఏళ్ల కింద ఈ సినిమా విడుదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న నానిలో నటున్ని చూసాడు ఇంద్రగంటి. అప్పటికే శీనువైట్లతో ‘ఢీ’.. బాపు ‘రాధాగోపాలం’ సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి దర్శకత్వం కోసం కథ సిద్ధం చేసుకుంటున్న రోజులవి. అలాంటి సమయంలో ఓ సినిమా ఎడిట్ సూట్లో ఇంద్రగంటి ఏదో పని మీద వచ్చి నానిని చూడటం.. కుర్రాడెవరో బాగున్నాడే అని తన సినిమాలో హీరోగా అవకాశం ఇవ్వడంతో నాని దశ మారిపోయింది.
అది మొదలు ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడు న్యాచురల్ స్టార్. చిరంజీవి తర్వాత ఏ అండదండలు లేకుండా ఇంతగా మార్కెట్.. ఫ్యాన్స్ సంపాదించుకుంది రవితేజ తర్వాత నానినే. అలాంటి నాని వచ్చి అప్పుడే 13 ఏళ్లైపోయింది. కాలం వేగంగా వెళ్లిపోతుందంటే ఏమో అనుకున్నాం కానీ మరీ ఇంత వేగంగా వెళ్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ‘అష్టాచమ్మా’ తర్వాత కూడా నానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
‘రైడ్’.. ‘భీమిలి కబడ్డి జట్టు’ లాంటి సినిమాలు పేరు తీసుకొచ్చాయి కానీ విజయం కాదు. కానీ 2011 ఈ హీరో కెరీర్‌ను మార్చేసింది. ఆ ఏడాది ‘అలా మొదలైంది’.. ‘పిల్ల జమీందార్’ విజయాలతో నాని క్రేజీ హీరో అయిపోయాడు. ఇక 2012లో వచ్చిన ‘ఈగ’ సినిమాతో నేషనల్ వైడ్ ఫేమస్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొదలైంది.
అలాంటి టైమ్‌లో వచ్చిన సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’. 2015 మార్చ్ 21న విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత ‘భలేభలే మగాడివోయ్’తో నాని కాస్తా న్యాచురల్ స్టార్ అయ్యాడు. ఈ 13 ఏళ్ళ ప్రయాణంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’కు నంది.. ‘భలేభలే మగాడివోయ్’ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు నాని.
అప్పట్నుంచి ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’,‘జెంటిల్ మన్’, ‘మజ్ను’, ‘నేను లోకల్’, ‘నిన్ను కోరి’, ‘ఎంసిఏ’ సినిమాలతో వరసగా 8 విజయాలు అందుకున్నాడు. 2018లో వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ సినిమాలతో ఫ్లాపులు ఇచ్చినా.. 2019లో జెర్సీ సినిమాతో మరోసారి విజయం అందుకున్నాడు ఈయన. ఈ చిత్రంతో తాను ఎంత గొప్ప నటున్ని అనే సంగతి మరోసారి నిరూపించాడు న్యాచురల్ స్టార్.