ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి సినిమాల హడావిడి మొదలైంది. ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ హీరోగా రూపొందిన మాస్ మసాలా మూవీ వీర సింహా రెడ్డి సంక్రాంతి బరిలో నిలవగా.. మరోవైపు చిరంజీవి హీరోగా తెరకెక్కిన మెగా మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగుతోంది.
అయితే ఈ రెండు సినిమాలను అడ్డు పెట్టుకుని ఫ్యాన్ వార్స్ సృష్టించేందుకు, కులాల మధ్య చిచ్చు రగిల్చేందుకు అధికార పార్టీ నుంచి కొన్ని దుష్టశక్తులు సిద్ధంగా ఉన్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నారా లోకేష్. అభిమానులు ఎవరు కూడా ఈ వలలో పడొద్దని ఆయన సూచించారు. సినిమా అంటే వినోదం మాత్రమే. దీనికి ఎలాంటి హద్దులు లేవు. మనమంతా ఒక్కటే.. కులం, మతం, ప్రాంతం మనల్ని విడదీయ లేవు అని నారా లోకేష్ పేర్కొన్నారు.