అన్‌స్టాపబుల్ టాక్ షో బాలయ్యలోని మరో కోణాన్ని బయటికి తీసుకొచ్చింది. బాలయ్యలో ఇంత చిలిపి ఉన్నాడా.. అమ్మో బాలయ్య మామూలోడు కాదు అంటూ ఈ టాక్ షో మొదలైన తర్వాత అందరూ అనుకుంటున్నారు. ముఖ్యంగా హోస్టింగ్‌లో చాలా మందిని మించిపోయాడు బాలయ్య. తొలి టాక్ షోతోనే సంచలనాలు రేపుతున్నాడు. ఆహాలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ నిజంగానే అన్‌స్టాపబుల్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ కూడా పూర్తైపోయాయి. తాజాగా 8వ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో రానా దగ్గుబాటి అతిథిగా వచ్చాడు. అందులో రానాతో బాలయ్య ఆడుకున్న తీరు మామూలుగా లేదు. ప్రతీ ప్రశ్నను కూడా చాలా సరదాగా అడిగేసాడు బాలయ్య. ముఖ్యంగా ఆయన అడిగిన తీరుకు అంతా ఫిదా అయిపోయారు. మరోవైపు రానా కూడా మంచి హోస్ట్. ఈయన కూడా చాలా టాక్ షోలు చేసాడు.
అందులోనూ రానా షోకు బాలయ్య కూడా వచ్చాడు. అందుకే వచ్చీ రాగానే.. తన టాక్ షోలలో ప్రతీ సీజన్ కూడా మీరు వచ్చిన ఎపిసోడ్ నెంబర్ వన్ అని చెప్పాడు రానా. దానికి వెంటనే బాలయ్య కూడా పంచ్ వేసాడు. ఇక్కడ బాలకృష్ణ అంటేనే నెంబర్ వన్ అంటూ నవ్వేసాడు. ఈ సంభాషణ ఇలా సాగుతుండగానే.. మీ భార్యకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పారు సర్ అంటూ అడిగాడు రానా.
‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో ఈ సరదా సన్నివేశం వైరల్ అవుతుందిప్పుడు. అన్‌స్టాపబుల్‌లో వచ్చే గెస్టులను చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నాడు బాలయ్య. అయితే రానా స్వతహాగానే హోస్ట్ కావడంతో బాలయ్యను తిరిగి ప్రశ్నలు అడిగాడు. మీ భార్య కాళ్లు పట్టుకున్నారా అని రానా అడిగితే.. కృష్ణుడు లాంటి వాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు.. నేను బాలకృష్ణుడిని కదా అంటూ సమాధానమిచ్చాడు బాలయ్య.
ఈ క్రమంలోనే ‘మీరెప్పుడైనా వసుంధరగారికి ఐ లవ్ యు అని చెప్పారా’ అని అడగ్గా ‘నీకెందుకయ్యా’ అంటూ బాలకృష్ణ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత తన శ్రీమతికి ఫోన్ చేశారు. మొత్తానికి ఎపిసోడ్ అంతా చాలా సరదాగా గడిచిపోయిందని ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతుంది. జనవరి 7న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. దీనికోసం అటు దగ్గుబాటి.. ఇటు నందమూరి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.