ఎవరూ ఊహించని విధంగా బాలయ్య, అల్లు అరవింద్ ఈ మధ్య క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. నిజానికి వాళ్లు 40 ఏళ్లుగా మంచి స్నేహితులు. కాకపోతే బయట ప్రపంచానికి తెలియదంతే. రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే బాలయ్యతో ఎప్పుడూ అల్లు అరవింద్ సినిమా చేయకపోవడం.. బయట కూడా పెద్దగా కలిసి కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం ఉంటుందని చాలా మంది అనుకున్నారు.
తామెంత మంచి స్నేహితులు అనేది ఈ మధ్యే అన్‌స్టాపబుల్ షో ద్వారా చెప్పాడు బాలయ్య. ఈ షోను ఏరికోరి కావాలనే బాలయ్యతో చేయాలని నిర్ణయించుకున్నాడు అల్లు అరవింద్. ఇప్పటి వరకు అలాంటి షోలు చేయని బాలయ్య అయితే.. ఫ్రెష్‌గా ఉంటుందని భావించి ఆయన్ని ఒప్పించి అన్‌స్టాపబుల్ షో చేసాడు అల్లు అరవింద్. అనుకున్నట్లుగానే ఈ షో సూపర్ హిట్ అయింది. ఇండియాలోనే నెంబర్ వన్ షోగా IMDB రేటింగ్ అందుకుంది.
అందులో ఏకంగా 9.8 రేటింగ్ అందుకుంది అన్‌స్టాపబుల్. మరోవైపు సెకండ్ సీజన్ కూడా మొదలు కానుంది. తొలి సీజన్ చివరి ఎపిసోడ్ మహేష్ బాబుతో ముగిసింది. రెండో సీజన్ కూడా త్వరలోనే మొదలు కానుంది. ఇదిలా ఉంటే కేవలం అన్స్టాపబుల్తోనే బాలయ్యను వదిలేలా కనిపించడం లేదు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్‌లో త్వరలోనే సినిమా చేయబోతున్నారు. ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది.
ఇప్పటికే బాలయ్య కోసం కథ సిద్ధం చేయిస్తున్నాడు అల్లు అరవింద్. తన కంపౌండ్‌లోకి వచ్చే దర్శకులకు బాలయ్య కోసం కథ సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే చెప్పేసాడు ఈయన. ఈ క్రమంలోనే ఓ దర్శకుడు చెప్పిన కథ నచ్చి.. అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా కథ నచ్చితే వాళ్లకు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేస్తుంటాడు అల్లు అరవింద్.
ఇప్పుడు కూడా ఇదే చేసాడు. కళ్యాణ్ రామ్‌తో బింబిసార సినిమాను తెరకెక్కిస్తున్న కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్‌కు అల్లు అరవింద్ తర్వాతి సినిమా కోసం 5 లక్షలు అడ్వాన్స్ ఇఛ్చినట్లు ప్రచారం జరుగుతుంది. బింబిసారను 40 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు వశిష్ట్. ఈ సినిమా పూర్తైన వెంటనే బాలయ్యతో ఈయన సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
అవినీతిలో కూరుకుపోయిన సమాజంపై ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చేసే యుద్ధమే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు బాలయ్య. గీతా ఆర్ట్స్ సినిమాలోనూ బాలయ్య అలాంటి ఖాకీ పాత్రలోనే నటించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అల్లు అరవింద్, బాలయ్య కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.