సంక్రాంతికి అన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోయినా.. ఒక్క నాగార్జున మాత్రమే ముందడుగు వేస్తున్నాడు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా ధైర్యంగా తన సినిమాను విడుదల చేస్తున్నాడు నాగార్జున. ఈయన నటించిన బంగార్రాజు విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తైపోయింది. ప్రమోషన్ కూడా జోరుగా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఛార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్నారు నాగార్జున, చైతన్య.
ఈ సినిమాలో ఇద్దరూ హీరోలుగా నటించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ ఇది. ఓ రకంగా చెప్పాలంటే ఇది ప్రీక్వెల్ అని చెప్పాలేమో..? ఎందుకంటే మొదటి భాగంలో బంగార్రాజు పాత్రను మాత్రమే చూపించారు. ఇందులో అసలు బంగార్రాజు ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చాడు అనేది చూపించబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ముఖ్యంగా నాగార్జున మరోసారి మాయ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఐదేళ్ళ కింద వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన సినిమాలకు పెద్దగా టాక్ రాకపోవడం కూడా దీనికి కలిసొచ్చింది. ఈ సారి అసలు సినిమాలే లేవు.. కాకపోతే కరోనా ఉంది. దాన్ని దాటుకుని సినిమా నిలబడటం అంటే చిన్న విషయం కాదు.. నాగార్జున అది చేస్తాడా లేదా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో ఏకంగా 8 మంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కన్ఫ్మ్ చేసాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ కాగా.. మరో ఆరుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ బంగార్రాజు సినిమాలో నటించారు.