నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సెన్సిబుల్ సినిమా లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24 న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది లవ్ స్టోరీ. దాదాపు 36 కోట్ల షేర్ వసూలు చేసి క్లీన్ హిట్గా నిలిచింది. తొలిరోజు నుంచే సినిమాకు మంచి టాక్ వచ్చింది.
ఈ మధ్య తెలుగు సినిమాలకు ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. మన సినిమాలను చూసి వాళ్ళు కథలు రాసుకుంటున్నారు. ఇక మన హీరోలు కూడా ఇతర ఇండస్ట్రీలపై సీరియస్ గా కన్నేశారు. అందుకే మన సినిమాలు వరుసగా ఇతర భాషల్లో కూడా విడుదల అవుతున్నాయి. తాజాగా లవ్ స్టోరీ సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమాని మలయాళంలో ప్రేమ తీరం పేరుతో విడుదల చేస్తున్నారు. సాయి పల్లవికి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఆమె నటించిన ప్రేమమ్ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత మరో మూడు నాలుగు సినిమాలు కూడా చేసింది సాయి పల్లవి. దాంతో మలయాళంలో ఉన్న మార్కెట్ క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
మరోవైపు సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా కూడా మలయాళంలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 29న ప్రేమ తీరం విడుదల కానుంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్ కోసం నాగ చైతన్య, సాయి పల్లవి కేరళ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతుంది.