తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని మరణాలు మాత్రం షాకింగ్‌గా అనిపిస్తుంటాయి. అలాంటి మరణమే నిర్మాత మహేష్ కోనేరు విషయంలో జరిగింది. కేవలం 40 ఏళ్ళ వయసులోనే ఈయన గుండెపోటుతో మరణించడం చాలా మందికి జీర్ణించుకోలేని విషాదం.. విషయం. ఫిల్మ్ జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన మహేష్.. చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థానానికి ఎదిగాడు.
ముందు జర్నలిస్టుగా మొదలు పెట్టి.. PROగా.. నిర్మాతగా మహేష్ కోనేరు ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్ పిఆర్ఓగా ఈయనకు మంచి పేరుంది. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మహేష్ కోనేరు. అందుకే ఆయన చనిపోయిన విషయం తెలియగానే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యుడు చనిపోయాడంటూ ట్వీట్ చేసారు. అంత అనుబంధం ఉంది వాళ్లతో ఆయనకు.
మహేష్ మరణం ఇండస్ట్రీలోనే కాదు.. ఫిల్మ్ జర్నలిస్టు కుటుంబంలో కూడా షాకింగే. ఎందుకంటే ఎప్పుడూ ఎంతో చలాకీగా నవ్వుతూ కనిపించే మహేష్.. ఉన్నట్లుండి హఠాన్మరణం చెందడంతో జీర్ణించుకోలేకపోయారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహేష్ కోనేరు.. రాజమౌళి ప్రారంభించిన వెబ్ సైట్ కోసం పని చేయడంతో పాటు ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమాకు పీఆర్వోగా పని చేయడం కెరీర్‌కు బాగా హెల్ప్ అయింది.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు పీఆర్వోగా చేసాడు. దాంతో ఇతర సినిమాలకు కూడా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. సున్నిత మనస్కుడు.. మంచోడు అనే ముద్ర అయితే ఈయనపై పడింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబానికి సన్నిహితుడు కావడంతో అతడిని నిర్మాతను చేసారు. కళ్యాణ్ రామ్ 118 సినిమాతో నిర్మాతగా మారిన మహేష్ కోనేరు.. ఆ తర్వాత నా నువ్వే, తిమ్మరుసు, మిస్ ఇండియా లాంటి సినిమాలు నిర్మించాడు.
ఇందులో 118, తిమ్మరుసు సినిమాలు భారీ లాభాలు తీసుకురాకపోయినా నష్టాలైతే తేలేదు. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి అక్టోబర్ 10న గుండెపోటుతో మరణించాడు. త్వరలోనే ఈయన అల్లరి నరేష్, సందీప్ కిషన్, నాగశౌర్య హీరోలుగా మూడు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా ఇచ్చాడు. అయితే ఈయన మరణం వెనక మిస్టరీ ఉందనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి.
ఆయన చనిపోయిన వారం తర్వాత మహేష్ కోనేరు మరణం అప్పుల వల్లే జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈయనకు భారీగానే ఈయనకు ఏకంగా 60 కోట్ల వరకు అప్పులు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. మహేష్ కోనేరుకు ఇండస్ట్రీలో చాలా మంచి పేరుంది. అందుకే ఆయన్ని నమ్మి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్టులు అప్పులు భారీగానే ఇచ్చినట్టు తెలుస్తోంది.