HBD Roja: మంత్రి రోజా పుట్టిన రోజు నేడు.. దీంతో ఆమె ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డ ఆశీస్సులతో రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి చేరాను అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకున్నానని, శ్రీవారిని ఎన్నిసార్లు చూసినా సంతోషంగా ఉంటుంది అన్నారు.
తన సినీ కెరీర్ లో అన్నమయ్య సినిమాలో నటించడం గొప్ప అనుభూతి కలిగించింది అన్నారు. స్వామిని చూడగానే మనం కూడా దేవుడి కుటుంబ సభ్యులుగా ఓ ఫీలింగ్ కలుగుతుంది అన్నారు. తిరుపతి చుట్టుపక్కల వారికి తమ స్వామి అని ఫీలింగ్ ఉంటుంది అన్నారు. శత్రువులను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. తనకు ఆరోగ్యం ప్రసాదించమని స్వామి వారిని కోరినట్లు తెలిపారు.
ఈ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రోజా తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారి సేవలో పాల్గోన్నారు. ఆమెతో పాటుగా జబర్దస్త్ నటి వర్షినీ, సింగర్ మంగ్లీ కూడా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కూతురి సినిమా ఎంట్రీపైనా ఆమె క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె, కుమారుడు నటించాలని కోరుకుంటే తప్పకుండా అండగా ఉంటాను అన్నారు రోజా. తన కుమార్తెకు చదువు పైన శ్రద్ధ ఎక్కువగా ఉందని, సైంటిస్ట్ కావాలనే ఆలోచన ఉంది. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు అన్నారు. ఓ తల్లిగా, నటిగా ఆమెకు అండగా ఉంటాను అన్నారు.
అయితే రోజా కూతురు సినిమాల్లో త్వరలో నటిస్తోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆఫర్లు కూడా వస్తున్నట్టు సమాచారం. కానీ ఇప్పటికైనా దీనిపై నిర్ణయం తీసుకోవలేదని తాజాగా మంత్రి రోజా మాటలు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేకపోయినా.. ఆమెను కూడా సినిమా హీరోయిన్ గా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అయితే తాజాగా రోజు చేసిన వ్యాఖ్యలు సైతం ఆమె రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఇవాళ స్వామి వారిని దర్శించుకున్న ఆమె.. శత్రువులపై విజయం సాధించేలా చూడాలని కోరుకున్నాను అన్నారు. అయితే ప్రస్తుతం ఆమెకు శత్రువులు అంటే ప్రత్యర్థి పార్టీలో కంటే సొంత పార్టీలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.
రోజా మంత్రి కాకముందు నుంచే నగరిలో వర్గ పోరు ఉంది. సొంత పార్టీ నేతలు కొందరు.. ఆమెకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కొందరైతే బహిరంగంగానే ఆమెను విమర్శిస్తున్నారు. అందుకే రోజా సైతం బహిరంగంగానే పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వర్గ పోరు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమవుతుందని ఆమె అనుచరులు అనుమానిస్తున్నారు. అందుకే ఆమె శ్రీవారిని అదే మొక్కుకున్నారు అంటున్నారు.