మెగాస్టార్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. అందులోనే వేదాళం రీమేక్ భోళా శంకర్ కూడా ఉంది. ఒకేసారి అన్ని సినిమాలు పూర్తి చేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్ధమైంది. దాంతో పాటు గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నాడు చిరంజీవి. దీనికోసం పక్కా ప్లాన్ చేసుకుని మరీ షూటింగ్ చేస్తున్నాడు చిరంజీవి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా భోళా శంకర్ మోషన్ పోస్టర్ విడుదలైంది. అందులో వింటేజ్ మాస్ మెగాస్టార్ కనిపిస్తున్నాడు.
మొహానికి చేయి అడ్డు పెట్టుకుని.. కళ్లజోడుతో ఒకప్పటికి చిరంజీవి మళ్లీ దర్శనమిచ్చాడు. మెహర్ రమేష్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. వేదాళం రీమేక్ కోసం దాదాపు రేళ్లకు పైగానే వర్క్ చేసాడు మెహర్. ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కోసం చాలా రోజుల పాటు కష్టపడ్డాడు. తెలుగులో మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసాడు మెహర్ రమేష్. ఇప్పుడు విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తుంటే ఈ సారి మెహర్ జాతకం మారిపోతుందనే నమ్మకం కనిపిస్తుంది.
ఈయన చివరి సినిమా షాడో 2013లో విడుదలైంది. వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు దాదాపు 20 కోట్లకు పైగానే నష్టాలు తీసుకొచ్చింది షాడో. దాంతో ఈ సినిమా తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు. హీరోలైతే మెహర్ రమేష్ నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రణాళిక రచిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మెహర్ రమేష్ మళ్లీ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేసాడు.
యాక్షన్ సీక్వెన్సులు బాగా తెరకెక్కిస్తాడనే పేరుండటంతో పెద్ద సినిమాల్లో అలాంటి సీన్స్ ఈయన చేతుల్లో పెట్టేవాళ్లు కొందరు దర్శకులు. ఇక అసిస్టెంట్‌గానే ఫిక్స్ అయిపోవాలేమో అనుకుంటున్న తరుణంలో ఏకంగా చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది. వేదాళం సినిమాను రీమేక్ చేసే బాధ్యతను మెహర్ చేతుల్లో పెట్టాడు మెగాస్టార్. అయితే ఇక్కడే చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం మెహర్ రమేష్ ఎంత పారితోషికం అందుకుంటున్నాడా అని..?
వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ అందుకోవడం లేదు మెహర్ రమేష్. ఈ సినిమా మొదలై పూర్తయ్యే వరకు నెల జీతానికి పని చేస్తున్నట్లు తెలుస్తుంది. నెలకు 5 లక్షల చొప్పిన ఎన్ని నెలలు సినిమా వర్క్ నడిస్తే.. అన్ని రోజులు జీతం ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. 2020 సెప్టెంబర్‌లోనే వేదాళం రీమేక్ ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. అంటే ఇప్పటికే ఈ సినిమా పేరు మీద 60 లక్షల జీతం అందుకున్నాడు మెహర్ రమేష్.
మరో ఏడాదైనా ఈ సినిమా పని ఉంటుంది. దాంతో మరో 60 లక్షలు ఖాయం. దాంతో పాటు సినిమా విడుదలైన తర్వాత 20 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన వేదాళం రీమేక్ భోళా శంకర్ కోసం మెహర్ రమేష్ దాదాపు 2 కోట్ల వరకు అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈయన ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా అంటే చాలా ఎక్కువే. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది.
అంతా కలిపితే 30 కోట్ల లోపే సినిమా పూర్తి కానుందని తెలుస్తుంది. అందులో చిరు పారితోషికం లేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కెఎస్ రామారావు కూడా భోళా శంకర్ నిర్మాణంలో భాగం కానున్నాడు. చిరు సూచన మేరకే ఈయన కూడా భాగం అవుతున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ ఖరారు అయిపోయింది. ఇక హీరోయిన్గా తమన్నా ఫిక్స్ అయింది. సైరా తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు చిరు, తమన్నా.