సాధారణంగా మెగా కుటుంబం నుంచి ఓ సినిమా వచ్చిందంటే చాలు.. అందరు హీరోలు వచ్చి సపోర్ట్ చేస్తుంటారు. హిట్టైనా.. ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాను మాత్రం భుజాన వేసుకుంటారు. ప్రమోషన్ దగ్గరుండి చేస్తుంటారు. అలాంటిది ఇంటిల్లుడి సినిమా వచ్చినపుడు ఇంకెంత ప్రమోషన్ చేస్తారు..? కానీ కళ్యాణ్ దేవ్ విషయంలో అలాంటిదేం జరగడం లేదు. కొన్నాళ్లుగా అసలు మెగా హీరోలతో కానీ.. కుటుంబంతో కానీ కలిసినట్లు కనిపించడం లేదు.
ఈయన దూరంగా ఉన్నాడా లేదంటే వాళ్లే దూరం పెట్టారా అనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా రెండేళ్లుగా కళ్యాణ్ దేవ్ ఆ మధ్య రెగ్యులర్గా మెగా హీరోలను కలిసేవాడు. అంతేకాదు ఫ్యామిలీ ఫోటోలు కూడా షేర్ చేసేవాడు. భార్య శ్రీజతో పాటు టూర్స్ వెళ్లి ఆ ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తుండేవాడు. కానీ కొన్ని నెలలుగా అలాంటిదేం జరగడం లేదు.
పైగా ఈ ఇద్దరి మధ్య అస్సలు పొసగడం లేదంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మెగా డాటర్ మరోసారి విడాకుల వైపు అడుగులు వేస్తుందనే వార్తలు కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే మరోసారి ఆ తప్పు చేయదు.. చేసినా చూసుకోడానికి పెద్దలు ఉన్నారు కదా అని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం అడుగులు మాత్రం అటు వైపు పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ముఖ్యంగా తన పేరు నుంచి కళ్యాణ్ తీసేయడంతో.. భర్తకు దూరం అవుతున్నట్లు చెప్పకనే చెప్తుంది శ్రీజ. అప్పట్లో సమంత కూడా ఇదే చేసింది. ముందు అక్కినేని తీసేసింది.. ఆ తర్వాత అక్కినేని కుటుంబానికి దూరం అయింది. ఇప్పుడు శ్రీజ సైతం కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో ఇదే చెప్పాలనుకుంటుందేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి.