దేశంలో కరోనా కేసులు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. అయినా కూడా బాలీవుడ్లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయడం లేదు. అక్కడ ఇప్పట్లో పెద్ద సినిమాలు విడుదల అయ్యేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి 25న ఆలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటించిన గంగుబాయి విడుదలయ్యే వరకు బాలీవుడ్లో కొత్త సినిమాల సందడి లేనట్టే. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి తెలుగు సినిమాలు ప్రయత్నిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా ఎప్పుడూ టాలీవుడ్ కంటెంట్‌పై బాలీవుడ్ బాగా ఆసక్తిగా ఉంది. బాహుబలి, సాహో, పుష్ప లాంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్లో బాగా పెంచేశాయి. అందుకే మన సినిమాలు చూడటానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. డబ్బింగ్ చేసి విడుదల చేసిన కూడా అద్భుతమైన విజయం ఇస్తున్నారు. మొన్న విడుదలైన పుష్ప ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
కనీసం ప్రమోషన్ కూడా చేయకుండా విడుదల చేసినా.. ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు మిగిలిన సినిమాలను కూడా హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధమవుతున్న రవితేజ ఖిలాడి సినిమాను హిందీలో డబ్ చేస్తున్నారు.
రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో ప్రతినాయకుడిగా నటించాడు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నటించిన సినిమా కావడంతో ఖిలాడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. అందుకే సినిమా విడుదలకు ముందే దర్శకుడు రమేష్ వర్మ నిర్మాత కోటిన్నర పెట్టి కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఈ సినిమాను ఇప్పుడు హిందీలో విడుదల చేస్తున్నారు. రవితేజ సినిమాలకు యూ ట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని ఖిలాడి కోసం వాడుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.