డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు (Mohan Babu) నటించిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. చాలా రోజుల తర్వాత ఈయన హీరోగా నటించిన సినిమా ఇది. గాయత్రి తర్వాత ఈయన నటించిన సినిమా కావడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన సినిమా గురించి మోహన్ బాబు బాగా చెప్పుకోవడంతో ఓ వర్గం ప్రేక్షకులు బాగానే ఎదురు చూసారు. అయినా కలెక్షన్ కింగ్ సినిమాలకు మునపటిలా ఇప్పుడు మార్కెట్ లేదని అందరికీ తెలుసు.
ఈయన సినిమాలు విడుదలైతే ఓపెనింగ్స్ తక్కువగానే వస్తాయని అంతా ఊహించారు. కానీ ఊహించని విధంగా అసలు ఓపెనింగ్స్ కూడా రావని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’కు (Son Of India collections) ఇదే జరుగుతుంది. ఈ సినిమాకు తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. 550కి పైగా సినిమాలు చేసిన ఈయనకు ఇంతకంటే ఘోరమైన పరాభవం ఇంకోటి ఉండదంటున్నారు ఫ్యాన్స్.
ఒకప్పుడు తిరుగులేదని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మోహన్ బాబు సినిమాలు.. ఇప్పుడు మాత్రం దారుణంగా బోల్తా కొడుతున్నాయి. ఫిబ్రవరి 18న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన సన్ ఆఫ్ ఇండియాకు మార్నింగ్ షో నుంచే తిరస్కరణ మొదలైంది. ఈ సినిమాకు మ్యాట్నీ షో నుంచే జనం లేరు.. ఇంకా చెప్పాలంటే మార్నింగ్ షోకు కూడా కేవలం 5 శాతం ఓపెనింగ్స్ కూడా రాలేదని లెక్కలు చెప్తున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలోనే అంత తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా కలెక్షన్ కింగ్ పేరు మీదుందిప్పుడు. దీన్ని చూసి ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా షేర్ తీసుకురాకపోగా.. నెగిటివ్ షేర్ తీసుకొచ్చిన ఘటన సన్ ఆఫ్ ఇండియాకే చెల్లింది. తొలి మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 లక్షల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అంటే షేర్ లెక్కలేస్తే రెంట్ కాదు కదా పార్కింగ్ డబ్బులు కూడా రానట్లే.
అంత దారుణంగా పడిపోయింది. ప్రేక్షకులు థియేటర్స్‌కు రాక.. జనం లేక చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసారు. మూడో రోజు నుంచి పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. లక్షల నుంచి గ్రాస్ కూడా వేలల్లోకి పడిపోయిందని తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో మాత్రమే 35 వేల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది. మిగిలిన చోట్ల కనీసం షేర్ కాదు కదా ఏం రావట్లేదనేది బయ్యర్ల వాదన కూడా. రెండో రోజు ఎక్కడా సన్ ఆఫ్ ఇండియాకు ఆడియన్స్ నుంచి ఆదరణ లభించలేదు.
ఒప్పుకోడానికి కాస్త కష్టంగానే అనిపించినా మోహన్ బాబు కెరీర్లో ఇంత కంటే పెద్ద డిజాస్టర్ లేదు.. ఇక రాదేమో కూడా. నాలుగేళ్ల కింద గాయత్రి విడుదలైనపుడు కనీసం 60 లక్షల షేర్ అయినా వచ్చింది. ఇప్పుడు అందులో 10వ వంతు అంటే కనీసం 6 లక్షల షేర్ కూడా రావడం లేదంటూ విశ్లేషకులు చెప్తున్న మాట. సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు భార్యగా మీనా నటించింది.
తమపై ట్రోల్స్ చేస్తున్న వాళ్లపై మంచు కుటుంబం కూడా సీరియస్ అయింది. వాళ్లపై 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా. మూడో రోజు చాలా చోట్ల సన్ ఆఫ్ ఇండియా సినిమా కనిపించలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మాత్రం మెయిన్ థియేటర్లో మూడు రోజులకు కలిపి 62 వేల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుగు ట్రేడ్ అనలిస్ట్ జీవి తెలిపారు.