మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ముందు అన్న... ఆ తర్వాత అమ్మ...ఇప్పుడు నాన్న.. నెలల వ్యవధిలోనే.. తనవారిని వరుసగా కోల్పోయాడు మహేష్. దీంతో మహేష్ వచ్చిన కష్టం మాటల్లో వర్ణించలేనిది. ఆయన శోకం ఎవరూ తీర్చలేనిది. తాజాగా మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే.
బుధవారం సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య కృష్ణ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. ఈరోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నటుడి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు పలు పూజలు నిర్వహించారు.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ తమిళ సై .. కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి కృష్ణకు నివాళులు అర్పించారు. అటు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుటు నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణితో కలిసి కృష్ణ పార్దివ దేహానికి అంజలి ఘటించారు.
తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ.