ఇప్పుడు నిజంగానే ఇలాంటి ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సారి మా అసోసియేషన్ ఎన్నికల్లో కంటికి కనిపించని యుద్ధం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. దాన్ని కొందరు ధైర్యంగా తెర ముందు కూడా చెప్పారు. అక్కడ పోటీలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఉన్నాడు.. మరొకవైపు ప్రకాష్ రాజ్ నిలబడ్డాడు.
ఆయన అంత ధైర్యంగా మా అధ్యక్షుడుగా పోటీ చేయడానికి ప్రధాన కారణం చిరంజీవి కుటుంబం నుంచి సపోర్ట్ రావడమే. మెగా కుటుంబం అండదండలు చూసుకున్న తర్వాతే ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఆయన ప్రకటించిన మరుసటి రోజే మంచు విష్ణు తాను పోటీ చేస్తున్నట్లు మీడియా ముందుకు వచ్చాడు. మరోవైపు ఈ ఎన్నికలను మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్థమవుతుంది.
తన తనయుడు విజయం సాధించడం తథ్యం అంటూ బల్లగుద్ది మరీ చెప్పాడు మోహన్ బాబు. ఇప్పుడు చెప్పినట్లుగానే మంచు విష్ణు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీనివెనుక మోహన్ బాబు వ్యూహ చతురత చాలానే ఉంది. తానే స్వయంగా ప్రతి ఒక్క సభ్యుడితో ఫోన్లో మాట్లాడటమే కాకుండా.. విష్ణు అధ్యక్షుడిగా ఎంపిక చేయాలి అంటూ విన్నవించాడు.
దాంతో పాటు ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాడు తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండడానికి పనికిరాడు అనే విషయాన్ని పదేపదే మీడియా ముందు గుర్తుచేశారు. అంతేకాదు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు కూడా ప్రకాష్ రాజ్‌పై మాటల దాడి బాగానే చేశారు. అటువైపు ఎంతో మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా.. ప్రకాష్ రాజ్ వైపు బలంగా నిలబడడానికి ఎవరూ లేరు.
చిరంజీవి కుటుంబం ఉందని బయట ప్రచారం జరుగుతున్నా ఒక్కసారి కూడా మెగాస్టార్ బయటికి వచ్చి ప్రకాష్ రాజ్‌కు ఓటేయండి అని చెప్పలేదు. కేవలం నాగబాబు మాత్రమే ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చాడు. అతడు వచ్చి ప్రమోషన్ చేసినా కూడా అది సరిపోలేదు. పైగా ఇన్ని విమర్శల మధ్య తాను మీడియా ముందుకు వచ్చి ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తే కచ్చితంగా గొడవ మరింత పెద్దది అవుతుందని చిరంజీవికి తెలియని విషయం కాదు.
అవతల వైపు తన స్నేహితుడు మోహన్ బాబు కుమారుడు పోటీలో ఉండడంతో సైలెంట్ అయిపోయాడు మెగాస్టార్. కాకపోతే మోహన్ బాబు మాత్రం ఈ మధ్య ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో చిరంజీవిపై పరోక్షంగా మాటల తూటాలు పేల్చాడు. స్నేహితుడు అని చెప్పుకోవడం కాదు.. అవసరం ఉన్నప్పుడు ఆ స్నేహం విలువ కూడా తెలిసి ఉండాలి అంటూ సెటైర్లు వేశాడు.