ఈ రోజుల్లో ఓ సినిమా రెండు వారాలు థియేటర్స్‌లో ఆడటమే మహా గొప్ప అయిపోయింది. మరీ బాగుందంటే మరో వారం అంతే. మూడు నాలుగు వారాల తర్వాత ఆ బొమ్మ కనిపించమన్నా కూడా కనిపించదు. నెల రోజుల్లోపే థియేటర్స్ నుంచి పోయి.. ఓటీటీ వేదికగా నేరుగా మన ఇంట్లోకి వచ్చేస్తోంది. అలాంటిది ఒకప్పుడు మాత్రం సినిమాలు ఏళ్ళకేళ్లు థియేటర్స్‌లోనే ఉండిపోయేవి. ఒక్కో సినిమా వందల రోజులు సినిమా టాకీస్‌లలో కనిపించేవి. 100 రోజుల నుంచి 1000 రోజుల వరకు ఆడిన సినిమాలు తెలుగులో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్స్‌కు మించిన ఆప్షన్ మరోటి లేదు. అందుకే అప్పట్లో కొన్ని రోజులు 1000 రోజులు కూడా ఆడాయి. మరి అలా తెలుగులో అత్యధికంగా ప్రదర్శించబడిన సినిమాలు ఏంటో చూద్దాం..
ప్రేమాభిషేకం | అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకథా చిత్రం ప్రేమాభిషేకం. నెగిటివ్ ఎండింగ్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. 1981 లో విడుదలైన ఈ సినిమా 533 రోజుల పాటు థియేటర్స్‌లో ఆడింది. శ్రీదేవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు.
అడవి రాముడు | రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అడవి రాముడు. 1977లో వచ్చిన ఈ సినిమా ఏడాది పాటు థియేటర్లో ఆడింది. 365 రోజులకు గాను దాదాపు 3 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఎన్టీఆర్ కమర్షియల్ స్టామినా ఏంటనేది అడవి రాముడు మరోసారి నిరూపించింది. జయసుధ, జయప్రద ఇందులో హీరోయిన్లు.