విడుదలకు వారం రోజుల ముందు నుంచే దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా జేమ్స్ జాతర మొదలైపోయింది.. ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పునీత్ జయంతి సందర్భంగా మార్చ్ 17న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటి నుంచే ట్రెండింగ్ అవుతుంది. అలా అయ్యేలా చేస్తున్నారు పునీత్ అభిమానులు. జేమ్స్ సినిమా కనీవినీ ఎరుగని స్థాయిలో కన్నడనాట విడుదల కానుంది. ఈ సినిమా బుకింగ్స్ వారం రోజుల ముందే మొదలు పెట్టారు.
అలా ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే మొదటి మూడు రోజుల టికెట్స్ అన్నీ అయిపోయాయి. కర్ణాటకలో ప్రస్తుతం జేమ్స్ ఫీవర్ నడుస్తుంది. ఎలాగైనా పవర్ స్టార్ సినిమా మొదటి రోజు చూసేయాలని ఉత్సాహంగా కనిపిస్తున్నారు అభిమానులు. కామన్ ఆడియన్స్ కూడా పునీత్ చివరి సినిమాను చూడ్డానికి ఎగబడుతున్నారు. నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో చనిపోతే దర్శక నిర్మాతలకు కూడా షాక్. ఎందుకంటే ఆయనపై నమ్మకంతో ఎన్నో సినిమాలకు వాళ్లు డిజైన్ చేసుకుంటారు.
పునీత్ రాబోయే మూడేళ్లకు దాదాపు అరడజన్ సినిమాలు లైన్లో పెట్టాడు. అలాంటిదిప్పుడు ఈయన లేడు. ఆ సినిమాలన్నీ ఆగిపోయాయి. అయితే జేమ్స్ షూటింగ్ 90 శాతం పూర్తయిన తర్వాత పునీత్ మరణించాడు. మిగిలిన షూటింగ్ ఎలాగోలా పూర్తి చేసారు మేకర్స్. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించాడు. ఇప్పటికే విడుదలైన జేమ్స్ టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. జేమ్స్ కోసం చాలా కష్టపడ్డాడు పునీత్.
ఈ సినిమాలో బాడీ బిల్డర్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకే జిమ్‌లో కూడా ముందు కంటే ఎక్కువ సేపు వర్కవుట్ చేసాడు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. ఈ మధ్యే జేమ్స్ టైటిల్ సాంగ్ వచ్చింది. దీనికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం. ఇదే ఆయన చివరి సినిమా అవుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు.
దాంతో ఎమోషనల్‌గా జేమ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్‌కు డబ్బింగ్ శివన్న ఇచ్చాడు. ముందు స్పాట్ డబ్బింగ్ ఉంచాలనుకున్నా.. అది క్లారిటీ లేకపోవడంతో శివన్న వాయిస్‌తో కవర్ చేస్తున్నారు. తమ్ముడి సినిమాకు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు పునీత్ ఫ్యాన్స్. చేతన్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
తమ్ముడి సినిమాకు డబ్బింగ్ చెప్పడం కంటే అదృష్టం మరోటి లేదని చెప్పాడు శివన్న. సినిమాను 2022 మార్చ్ 17.. పునీత్ రాజ్‌కుమార్ జయంతి రోజు విడుదల చేయనున్నారు. కర్ణాటకలో ఇదివరకు మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో ఒకేరోజు 4000 షోలు పడబోతున్నాయి. వారం రోజుల పాటు రాష్ట్రంలోని ప్రతీ థియేటర్లో కేవలం పునీత్ సినిమా మాత్రమే ఉండబోతుంది. మరి చూడాలిక.. పవర్ స్టార్ జాతర ఎలా ఉండబోతుందో..?