దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా జేమ్స్ రెండో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టించింది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా ఊచకోత కోస్తుంది. ఇదివరకు ఎప్పుడూ కన్నడ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరిచయం చేస్తున్నాడు జేమ్స్. కేజిఎఫ్ సినిమానే అనుకుంటే.. దాన్ని మించిన కలెక్షన్స్ ఈ సినిమాకు వస్తున్నాయి. సాధారణంగానే పునీత్ సినిమా విడుదలైందంటే బాక్సాఫీసు దగ్గర రావడం కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం.
అలాంటిది ఇప్పుడు ఆయన భౌతికంగా లేడు. ఇదే ఆయన చివరి సినిమా అని తెలిసిన తర్వాత ప్రతి ఒక అభిమాని థియేటర్‌కు కదులుతున్నాడు. ఆ ప్రభావమే ఇప్పుడు కలెక్షన్ రూపంలో కనిపిస్తుంది. తొలి రోజు ఏకంగా 28 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా 18 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో మాత్రమే కేవలం రెండు రోజుల్లో 46 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలన రికార్డులకు తెర తీస్తుంది జేమ్స్.
మూడో రోజు దాదాపు 20 కోట్లకు పైగా గ్రాస్ వచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా బిజినెస్ 60 కోట్లకు పైగా జరిగింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే వారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి జాయిన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం బెంగళూరులోనే ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తోంది. గతంలో ఏ సినిమాకు లేని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నాయి.
తొలి మూడు రోజులు మాత్రమే కాదు.. ఆ తర్వాత కూడా అదే దూకుడు చూపించేలా కనిపిస్తోంది జేమ్స్. మొదటివారం కేవలం పునీత్ సినిమా తప్ప ఇంకే సినిమా విడుదల చేయకూడదనే ముందుగానే నిర్ణయించుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇది ఆయనకు తాము ఇచ్చే నివాళి అని చెప్పారు. అన్నట్లుగానే వారం రోజుల టికెట్స్ కూడా హాట్ కేక్స్లా అమ్ముడైపోయాయి. అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన జేమ్స్ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ ఎనర్జీ లెవెల్స్ మరో స్థాయిలో ఉన్నాయి.
ఇది ఆయన చివరి సినిమా అంటే ఎవరు నమ్మరు. చేతన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా నటించాడు పునీత్. శ్రీకాంత్, శరత్ కుమార్, ఆదిత్యా మీనన్ లాంటి సీనియర్ నటులు ఇందులో చాలామంది ఉన్నారు. మొత్తానికి చివరి సినిమాతో కన్నడ ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తున్నాడు పవర్ స్టార్. ఆయన లేడన్న నిజాన్ని దిగమింగుతూ కన్నీరు కారుస్తూ థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు అభిమానులు.