ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఏ వేడుక జరిగినా కూడా చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్తున్నాడు. ఆయనను పిలిచిన వెంటనే కాదనకుండా వెళ్లి తన ఆశీర్వాదాలు ఇచ్చి వస్తున్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల వేడుకలకు చిరంజీవి హాజరవుతున్నాడు. ఇదే క్రమంలో తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి రావాల్సి ఉంది.
చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్కు వస్తే అంచనాలు మరింత పెరుగుతాయని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్న వేళ.. ఆయనకు కరోనా రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీని కరోనా పట్టిపీడిస్తోంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈయనకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ తన సోషల్ మీడియా అకౌంట్లో తెలియజేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డట్టు తెలియజేశారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు.
గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు మెగాస్టార్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంటి నుంచి బయటికి రాలేడు. దాంతో కీర్తి సురేష్ గుడ్ లక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిథి కూడా మారిపోయాడు. తండ్రి స్థానంలో కొడుకు వస్తున్నాడు. గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
జనవరి 26 సాయంత్రం పార్క్ హయత్ హోటల్లో ఈ వేడుక జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. పూర్తిగా కోవిడ్ నిబంధనల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కాగా కీర్తి సురేష్ మెగా కుటుంబానికి బాగా చేరువైందిప్పుడు. చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చెల్లిగా నటిస్తుంది కీర్తి.