అభిమాన హీరోలకు ఏదైనా జరిగితే ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేరు. అలాంటిది వాళ్ల ప్రాణం మీదకు వస్తే ఇంకేమైనా ఉందా..? తమ ప్రాణాలు పోయినంత ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు కన్నడనాట ఇదే జరుగుతుంది. తాము దేవుడిగా కొలిచే పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడు.. రాడని తెలిసిన తర్వాత అభిమానుల గుండెలు ఆగిపోతున్నాయి. ఈయనతో పాటే మరికొందరు అభిమానులు కూడా చితి వైపు అడుగులు వేస్తున్నారు.
తమ అభిమాన నటుడిని కడసారి చూసుకోడానికి లక్షల్లో అభిమానులు వస్తున్నారు. కంఠీరవ స్టేడియం వైపు కన్నీళ్ళతో ఎంతోమంది ఫ్యాన్స్ కదులుతున్నారు. పవర్ స్టార్ అమర్ రహే.. అప్పు అమర అంటూ పునీత్ కోసం కన్నీరు పెట్టుకుంటున్నారు. అభిమానుల రోదనలతో కర్ణాటక మొత్తం ఇప్పుడు కంటతడి పెడుతుంది. పునీత్ లాంటి స్టార్ హీరో ఇలా హఠాన్మరణం చెందుతాడని ఎవరూ అనుకోలేదు.
అలాగే రాయచూర్ జిల్లాలో కూడా ఇద్దరు పునీత్ అభిమానులు బసవ గౌడ్, మహ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందులో ఒకరు హాస్పిటల్‌కు తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే చనిపోయాడు. మరికొరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మరోవైపు చామరాజునగర్ జిల్లాలోనూ కూడా మునియప్ప అనే అభిమాని టీవీ చూస్తూనే పునీత్ మరణవార్త తెలిసి గుండెపోటుతో చనిపోయాడు.