అఖండ సినిమాతో బాలయ్య మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఈయనకు సరైన సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఎలా ఉంటుందో చూపించాడు నటసింహం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ.. ప్రతికూల పరిస్థితుల్లోనూ బాక్సాఫీస్ తుప్పు వదిలించింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలో గోపీచంద్ మలినేనితో సినిమాకు సిద్ధం అవుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇది ఆయనకు 107వ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సంక్రాంతికి ముహూర్తం పెట్టి.. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు బాలయ్య. నటసింహం చేతికి లాఠీ వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. పోలీస్ కారెక్టర్స్ బాలయ్యకు బాగానే కలిసొచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే చేయబోతున్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని కూడా హీరోలను పోలీస్ కారెక్టర్స్లో బాగానే ప్రజెంట్ చేస్తాడు.
క్రాక్ సినిమాలో రవితేజను చూపించిన విధానమే స్టార్ హీరోలను ఫిదా అయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగానే.. కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించబోతున్నాడు. ఇదే విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
అసలు ఈ సినిమాలో ముందు విజయ్ సేతుపతిని విలన్గా ఒప్పించాలని ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో దునియా విజయ్ లైన్లోకి వచ్చాడు. ఈ సినిమా కోసం ఆయనకు భారీగానే పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022 దసరాకు సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వేటపాలెం నేపథ్యంలోనే సినిమా తెరకెక్కనుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్ర కథను కూడా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. పక్కా స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేసుకున్న తర్వాత బాలయ్యను కలిసి సింగిల్ సిట్టింగ్లో ఒప్పించాడు గోపీచంద్. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తోనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.