ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా విడుదలైన నెల రోజుల్లోనే ఓటిటిలో వచ్చేస్తుంది.. మహా అయితే 50 రోజులు దాటితే చాలు.. కచ్చితంగా ఓటిటి ప్రింట్ రావాల్సిందే. కానీ పెళ్లి సందడి సినిమా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఈ చిత్రం విడుదలై 100 రోజులు దాటినా కూడా ఇప్పటికీ ఒరిజినల్ ప్రింట్ రాలేదు. మొన్న సంక్రాంతికి వచ్చేస్తుందనే వార్తలు వచ్చినా కూడా అది జరగలేదు. ఇప్పటి వరకు ఏ ఓటిటి సంస్థ దగ్గర పెళ్లి సందడి రైట్స్ లేవనేది అసలు ట్విస్ట్.
2021లో వచ్చిన సర్ప్రైజింగ్ హిట్స్‌లో పెళ్లి సందడి కూడా ఉంటుంది. కొన్నిసార్లు సినిమాలు టాక్‌తో పని లేకుండా క్రేజ్‌తోనే మంచి వసూళ్లు తీసుకొస్తుంటాయి. అలాంటిదే పెళ్లి సందD విషయంలో జరుగుతుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకున్నారు. పెట్టిన దానికంటే బాగానే లాభాలు వచ్చాయి ఈ చిత్రానికి. 5.7 కోట్ల బిజినెస్ చేస్తే.. 8 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది పెళ్లి సందడి.
తెలుగు ఇండస్ట్రీలో క్లాసిక్ స్థాయిని అందుకున్న సినిమా పెళ్లి సందడి. శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇది. 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. 12 కోట్ల షేర్ వసూలు చేసి నిర్మాతలకు ఎన్ని రెట్ల లాభాలు అందించిందో కూడా అర్థం కాలేదు. దాని లాభాలు చాలా కాలం వరకు లెక్క పెడుతూనే ఉన్నామని చెప్పాడు నిర్మాత అల్లు అరవింద్.
ఆయనతో పాటు అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా వచ్చి అప్పుడే పాతికేళ్లైపోయింది. 25 ఏళ్ళ తర్వాత అదే టైటిల్‌తో యాదృశ్చికంగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. అప్పుడు తండ్రి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాతోనే ఇప్పుడు తనయుడు కూడా వచ్చాడు. ఐదేళ్ల కింద నిర్మల కాన్వెంట్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా.. అది సరదాగానే చేసాడు రోషన్. కానీ అది సీరియస్‌గా తీసుకోలేదు.
గతేడాది పెళ్లి సందడి సినిమాతో పూర్తిస్థాయిలో లాంఛ్ అయ్యాడు శ్రీకాంత్ తనయుడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో దర్శకేంద్రుడు కూడా నటించాడు. గౌరీ రోనంకీ దర్శకురాలు. ట్రైలర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.
నైజాంలో 2.08 కోట్లు వసూలు చేసిన పెళ్లి సందడి.. సీడెడ్ విషయానికి వచ్చేసరికి 1.55 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో పాటు మిగిలిన ఏరియాలలో కూడా మంచి వసూళ్లు తీసుకొచ్చింది. ఉత్తరాంధ్రలో 1.06 కోట్లు.. ఈస్ట్ వెస్ట్ కలిపి 93 లక్షలు.. గుంటూరు, కృష్ణా కలిపి కోటి 9 లక్షలు.. నెల్లూరు 35 లక్షలు.. ఏపీ తెలంగాణలో 7.06 కోట్లు షేర్ వసూలు చేసింది పెళ్లి సందడి. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల వరకు వసూలు చేసింది ఈ చిత్రం.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ సినిమా విడుదలై 100 రోజులు దాటిన తర్వాత ఇప్పటికీ కూడా ఒరిజినల్ ప్రింట్ విడుదల కాలేదు. ఓటిటిలో సినిమా విడుదల కాకపోవడానికి కారణమేంటి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అసలు ఎందుకు పెళ్లి సందడి సినిమా ఓటిటిలోకి రాలేదంటూ ఆరా తీస్తున్నారు. దీనికి కొన్ని బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఓటిటి రైట్స్ అమ్ముడు కాలేదని.. ఇంకా చెప్పాలంటే నిర్మాతలే ఇంకా ఎవరికీ ఇవ్వలేదని తెలుస్తుంది. దానికి కారణం వాళ్లు చెప్పిన రేటుకు ఓటిటి సంస్థలు ఒప్పుకోకపోవడమే. కొత్త హీరో సినిమాకు వర్కవుట్ కాని రేట్‌ను నిర్మాతలు చెప్తుండటంతో పెళ్లి సందడి సినిమాను ఎవరూ తీసుకోలేదని తెలుస్తుంది. హాట్ స్టార్ డిస్నీ తీసుకుందనే వార్తలు వచ్చినా.. తమ దగ్గర రైట్స్ లేవని వాళ్లు ఓపెన్‌గానే అనౌన్స్ చేసారు.
త్వరగా ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలనే కామెంట్స్ సోషల్ మీడియాలో అభిమానుల నుంచి నిర్మాతలకు బాగానే వస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా.. కీరవాణి అందించిన పాటలకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా మధురా నగరిలో, బుజ్జులు బుజ్జులు, ప్రేమంటే ఏంటి పాటలు కన్నుల పండుగలా ఉంటాయి. సినిమా విజయంలో పాటలదే కీలక పాత్ర కూడా.
రాఘవేంద్రరావుతో పాటు బాహుబలి నిర్మాతలు ఈ సినిమాను నిర్మించారు. తక్కువ బడ్జెట్‌తోనే వచ్చిన పెళ్లి సందడి మంచి లాభాలే తీసుకొచ్చింది. ఇప్పుడు ఓటిటి డీల్ కూడా త్వరగా క్లోజ్ చేయాలంటూ వాళ్లను కోరుతున్నారు ఫ్యాన్స్. రోషన్ మేక, శ్రీలీల రొమాన్స్ బుల్లితెరపైకి వస్తే అదిరిపోతుందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ కూడా ఇప్పటి వరకు ఎవరికీ అమ్మలేదు. ఏదేమైనా 100 రోజుల తర్వాత కూడా ఒరిజినల్ ప్రింట్ రాని సినిమాగా రికార్డు సృష్టించింది పెళ్లి సందడి.