వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపై కూడా జూనియర్ ఎన్టీఆర్ కుమ్మేస్తున్నాడు. ఈయన హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే సమంత, రాజమౌళి, కొరటాల, రామ్ చరణ్ సహా చాలా మంది సినీ ప్రముఖులు ఈ షోకు వచ్చారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా వచ్చాడు. సాధారణంగా బయట ఇలాంటి కార్యక్రమాలకు రావడానికి సూపర్ స్టార్ పెద్దగా ఆసక్తి చూపించడు.
జూనియర్ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం దృష్ట్యా ఈ షోకు వచ్చాడు మహేష్ బాబు. ఈ ఎపిసోడ్లో చాలా విషయాల గురించి చర్చించుకున్నారు మహేష్, తారక్. గేమ్ ఆడుకుంటూనే.. సినిమాల గురించి కూడా మాట్లాడుకున్నారు. అలాగే తమ వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. మహేష్ బాబును చాలా విషయాల గురించి అడిగాడు జూనియర్. మహేష్ బాబు కూడా ఓపెన్ అయిపోయి సమాధానాలు ఇచ్చాడు.
ఇక ఆ తర్వాత సూపర్ స్టార్‌ను గేమ్స్ గురించి ప్రశ్నించాడు జూనియర్. మీరు ఏయే ఆటలు బాగా ఆడతారంటూ అడిగాడు. దానికంటే ముందు రాజమౌళి టాపిక్ కూడా వచ్చింది. ఈయన దర్శకత్వంలో నాలుగు సినిమాలు చేసాడు జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెం 1, సింహాద్రి, యమదొంగ తర్వాత ఇప్పుడు ట్రిపుల్ ఆర్‌లో నటించాడు. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా మూడేళ్లు మరే సినిమాలో నటించలేదు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం అంటే సులువు కాదని చెప్పాడు జూనియర్. తాజాగా ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రాజమౌళి గురించి చెబుతూ మహేష్ బాబును భయపెట్టే ప్రయత్నం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. మీరు ఆటలు ఆడతారా అంటూ మహేష్ బాబును ప్రశ్నించాడు తారక్.
ఒకప్పుడు ఆడేవాడినని కానీ.. ఇప్పుడు ఆడటం లేదని చెప్పాడు మహేష్ బాబు. క్రికెట్ ఆడతారా అని ఎన్టీఆర్ అడగగా.. మహేష్ ఆడతానని చెప్పారు. ఆ తర్వాత రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్‌తో ఆడతానని క్రికెట్ బాల్ అంటే కష్టమని మహేష్ ఆట పట్టించాడు. అయితే అక్కడే తారక్ అసలు సెటైర్లు వేసాడు. త్వరలోనే జక్కన్నతో సినిమా చేయబోతున్నారుగా.. అన్ని ఆటలు ఆడిస్తాడులే మీతో అంటూ పంచులు వేసాడు.
రాజమౌళితో సినిమా అంటే అన్ని ఆటలు వచ్చేస్తాయంటున్నాడు ఈయన. వచ్చే ఏడాది మహేష్ బాబు, రాజమౌళి సినిమా మొదలు కానుంది. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కథను విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రియా నవల ఆధారంగా సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.