అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయాలి తప్పులేదు కానీ అది తమ ఉనికినే కోల్పోయేలా మాత్రం చేయకూడదు. అలా చేస్తే కచ్చితంగా తమ జోరుకు తామే బ్రేకులు వేసుకున్నట్లు. కొందరు జబర్దస్త్ కమెడియన్స్ ఇదే చేసారు. కూర్చున్న కొమ్మను నరికేసుకోవడం తెలివైన పని కాదంటారు. కానీ కొందరు జబర్దస్త్ మాజీ టీం లీడర్స్ మాత్రం ఇదే చేసారంటారు విశ్లేషకులు. ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో మొదలైనపుడు అసలు సినిమాలే లేని కొందరు కమెడియన్స్‌ను తీసుకుని వాళ్లకు లైఫ్ ఇచ్చింది మల్లెమాల ప్రొడక్షన్స్.
అప్పటి వరకు సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేసుకుంటూ వచ్చిన ధనాధన్ ధన్‌రాజ్, వేణు లాంటి వాళ్లను పిలిచి మరీ అవకాశాలిచ్చారు. వాళ్లతో పాటే రఘు, పటాస్ ప్రకాశ్ లాంటి చాలా మంది కమెడియన్స్‌ను తీసుకొచ్చి ఇక్కడ షో చేయించారు. అయితే కొన్నాళ్ల పాటు బాగానే సాగినా కూడా ఉన్నట్లుండి రెండేళ్ల తర్వాత వేణు, ధనరాజ్ సహా చాలా మంది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు.
అందులో చాలా మంది సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పి మానేసారు. దాంతో బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయారు వాళ్లు. ముఖ్యంగా ధనరాజ్, వేణు అయితే జబర్దస్త్ షోలో ఉన్నపుడు స్టార్స్.. కానీ బయటికి వచ్చిన తర్వాత కనీసం ఈవెంట్స్ కూడా లేక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాళ్లను బయట పట్టించుకునే వాళ్లు కూడా లేరు.. సినిమాలు కూడా రాలేదు.
జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తిరిగి తీసుకోవడంలో మల్లెమాల ఆసక్తి చూపించలేదు. దాంతో ఇన్నేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. ఆ మధ్య జీ తెలుగులో అదిరింది అనే షోలో వాళ్లందర్నీ మళ్లీ తీసుకున్నారు. జబర్దస్త్ షో డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ దాన్ని కూడా డిజైన్ చేసారు. దాంతో అప్పుడు బయటికి వెళ్లిపోయిన ధనరాజ్, వేణు సహా చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లను కూడా ఈ షో కోసం తీసుకున్నారు.
అయితే ఈ షో ఏడాది కూడా రన్ అవ్వలేదు. ఆల్రెడీ జబర్దస్త్ ఉన్నపుడు మళ్లీ దీన్ని ఎవరు చూస్తారు అన్నట్లుగా రేటింగ్స్ కూడా రాలేదు. దాంతో అక్కడ్నుంచి కూడా అంతా మానేయక అవ్వక తప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఛానెల్ షిఫ్ట్ చేసి మా టీవీలో కామెడీ స్టార్స్ అంటూ వస్తున్నారు. అక్కడ చమ్మక్ చంద్ర, ధన్‌రాజ్, వేణుతో పాటు చలాకీ చంటి, మాస్ అవినాష్ కూడా యాడ్ అయ్యాడు.