జబర్దస్త్ కామెడీ షోలో లవ్ ట్రాక్స్ అనేది కొత్త కాదు. అయితే అవన్నీ కేవలం టిఆర్పీ రేటింగ్స్ కోసమే చేస్తుంటారు. అక్కడ ఎవరెవరికి లింకులు పెట్టినా కూడా అదంతా కేవలం వాళ్ల కామెడీ కోసం మాత్రమే. అందుకే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి కమెడియన్లకు ఏకంగా ఉత్తుత్తి పెళ్లిళ్లు కూడా చేసారు. సుధీర్-రష్మి, హైపర్ ఆది-వర్షిణి అంటూ ఇలా వాళ్లే జోడీలు క్రియేట్ చేసి.. వాళ్ల మధ్య ఏదో ఉంది అనేలా లవ్ ట్రాక్స్ డిజైన్ చేస్తుంటారు.
అందుకే కొందరు నిజంగా ప్రేమించుకుంటున్నా కూడా అదంతా ఉత్తుత్తుది అనుకుంటుంటారు ప్రేక్షకులు. అయితే ఇలాంటి డూప్ లవ్ ట్రాక్స్ మధ్యలో ఓ కమెడియన్ మాత్రం నిజంగానే ప్రేమలో పడ్డాడు. ఆయనెవరో కాదు.. రాకింగ్ రాకేష్. జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. ముఖ్యంగా పిల్లలతో ఈయన చేసే స్కిట్స్ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాళ్లు కాకుండా పెద్ద వాళ్లతోనే స్కిట్స్ చేస్తున్నాడు రాకేష్.
ఇదిలా ఉంటే త్వరలోనే ఈయన పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అది కూడా తన కంటెస్టెంట్తోనే అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా తనతో పాటు టీమ్‌లో మెంబర్‌గా చేస్తున్న సహా నటి జోర్దార్ సుజాతతో ప్రేమలో ఉన్నాడు. బిగ్ బాస్ నుంచి సుజాతకు మంచి గుర్తింపు వచ్చింది. దానికి ముందు ఓ న్యూస్ ఛానెల్ యాంకర్‌గా పని చేసిన సుజాత.. ఇప్పుడు ఈవెంట్స్ కూడా చేస్తుంది. అయితే కొన్ని రోజులుగా జబర్దస్త్ చేస్తూ అక్కడే బిజీ అవుతుంది జోర్దార్ బ్యూటీ.
అక్కడే సుజాతతో రాకేష్‌కు మంచి స్నేహం ఏర్పడింది. అదే ఇప్పుడు ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఇద్దరు కూడా స్కిట్లలో కామెడీ పండించడం కోసం లవ్‌లో ఉన్నట్లుగా నటిస్తున్నారేమో అనుకున్నారంతా. కానీ అది నిజమే అని తర్వాతే తెలిసింది. మొన్నటి వాలెంటైన్స్ డే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టారు. ఒక రింగ్ పెట్టి మరీ సుజాతకు ప్రపోజ్ చేశాడు రాకేష్.
ఇది కూడా డ్రామానే అనుకున్నారు కానీ నిజంగానే ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. తమతో పాటు జబర్దస్త్‌లో నటించే వాళ్లే చెప్తున్న మాట. జబర్దస్త్ ఇతర లవ్ స్టోరీల మాదిరి కాకుండా ఈ సారి మాత్రం వీళ్లు నిజమైన ప్రేమకథ నడిపిస్తున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని ఒక ప్రకటన కూడా వచ్చింది. తాజాగా జబర్దస్త్ కామెడియన్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాకేష్, సుజాత ఈడు జోడు చాలా బాగుంటుంది.
వాళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయాణిస్తూ ఉంటారని చెప్పాడు. అంతేకాదు ఇద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం.. స్టేజీపై కూడా ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపించుకుంటారు. ఆ ఇద్దరూ కలిసి జీవితం పంచుకుంటే కచ్చితంగా బాగుంటుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 2022లోనే సుజాత, రాకేష్ పెళ్లి జరగబోతుందంటూ స్వీట్ న్యూస్ చెప్పాడు బాబు.