షకలక శంకర్ టీమ్‌లో ఉండే శ్రీధర్ దర్శకుడిగా మారి శంకర్‌తోనే శంభో శంకర సినిమా చేసాడు. ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అయితే టాలెంటెడ్ దర్శకులు, రైటర్స్‌తో పాటు కొందరు జబర్దస్త్ పేరు చెప్పుకుని డబ్బులు ఖర్చు చేసే బ్యాచ్ కూడా వస్తున్నారు. తాజాగా ఇలాంటి కమెడియన్ ఒకరు నిర్మాతను నిండా ముంచేసాడని తెలుస్తుంది.
కొన్నేళ్ల పాటు జబర్దస్త్‌లోనే ఉండి.. ఆ తర్వాత ఛానెల్ మారిన ఓ కమెడియన్.. ఈ మధ్యే దర్శకుడిగా మారాడు. తన డ్రీమ్ దర్శకుడిగా మారడం అంటూ.. ఔట్ డేటెడ్ సీనియర్ హీరోను పట్టుకుని కథ చెప్పి ఒప్పించాడు. అలాగే తన ఊరు నుంచే ఓ నిర్మాతను కూడా తెచ్చుకుని సినిమా మొదలు పెట్టాడు. తొలి సినిమాకే కోట్ల రూపాయల బడ్జెట్ ప్లాన్ చేసాడు సదరు కమెడియన్.
కనీసం కోటి రూపాయల మార్కెట్ లేని హీరోను పెట్టుకుని.. కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టమంటే పాపం నిర్మాతైనా ఎక్కడ్నుంచి పెడతాడు..? అందుకే కొన్ని రోజుల షూటింగ్ అయిపోయిన తర్వాత.. తలా తోక లేని అతగాడి డైరెక్షన్ చూసి కోపగించుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు అయినట్లు తెలుస్తుంది. చిర్రెత్తుకొచ్చిన నిర్మాత..
తన డబ్బులు మొత్తం కట్టాలంటూ మన జబర్దస్త్ దర్శకుడికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా పేరుతో 30 లక్షల వరకు ఖర్చు చేయించాడు ఆ కమెడియన్ కమ్ దర్శకుడు. దాంతో ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఈ నిర్మాత చుక్కలు చూస్తున్నట్లు తెలుస్తుంది. మనోడు ఇవ్వనుపో అనడంతో నిర్మాత ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ రోజుల్లో ఓ దర్శకుడిని నమ్మి అవకాశం ఇవ్వడమే గొప్ప. కానీ ఎలాంటి అనుభవం లేని ఓ నటుడు.. తాను దర్శకత్వం చేస్తానంటే నమ్మి డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటో అనేది ఎవరికీ అర్థం కాని విషయం. సినిమా మొదలవ్వకముందే 30 లక్షలు ఖాళీ చేస్తే.. పూర్తయ్యే వరకు ఆ నిర్మాత పరిస్థితేంటో మరి..? మరి ఇలాంటి సమయంలో ఈ జబర్దస్త్ టోపీ నుంచి ఎలా ఆ నిర్మాత తప్పించుకుంటాడో చూడాలి.