తెలుగు బుల్లితెరపై దాదాపు 9 ఏళ్ళుగా నిర్విరామంగా కొనసాగుతున్న సంచలన కామెడీ షో ‘జబర్దస్త్’. దీని నుంచి పదుల సంఖ్యలో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రస్తుతం వాళ్లంతా బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా సత్తా చూపిస్తున్నారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి కమెడియన్లు ఈ రోజు ఇంత పేరు తెచ్చుకున్నారంటే కారణం మరో అనుమానం లేకుండా జబర్దస్త్ మాత్రమే. జీరోలుగా ఉన్న వాళ్లను ఇప్పుడు హీరోలను చేసింది ఈ షో.
అందుకే జబర్దస్త్ అంటే వాళ్లకు కూడా పంచ ప్రాణాలు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై కామెడీని పంచుతూ రేటింగ్స్ పరంగా ఒకప్పుడు సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా ఈ షో నుంచి బాగానే సంపాదించింది. ఒకప్పుడు బుల్లితెర కనీసం చూడనటువంటి టిఆర్పీలు తీసుకొచ్చింది జబర్దస్త్ కామెడీ షో. కేవలం ఈ షో కారణంగా పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో రాణిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
అంతెందుకు అప్పటి వరకు ఇండస్ట్రీలోనే ఉన్న.. అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ లాంటి యాంకర్స్‌ను ఎవరూ పట్టించుకోలేదు. అదే జబర్దస్త్ షో మొదలైన తర్వాత ఈ ఇద్దరూ స్టార్స్ అయిపోయారు. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. దానికితోడు బాగా డల్‌గా ఉన్న సమయంలోనే రోజా, నాగబాబుకు కూడా ఈ కామెడీ షో హెల్ప్ అయింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు 12, 13 రేటింగ్ తీసుకొచ్చిన ఈ షో.. ఇప్పుడు 5, 6 తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడుతుంది.
దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ఒకప్పట్లా ఇప్పుడు అక్కడ నవ్వులు రావడం లేదు.. ఆ స్థాయిలో స్కిట్స్ పేలడం లేదు. పైగా డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఎక్కువవుతున్నాయి. దాని కారణంగా కుటుంబ వీక్షకులు ఈ షోకు దూరం అవుతూ వస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యమైన కారణం.. యూ ట్యూబ్‌లో చూసుకుందాం లే అనుకుని టీవీలో చూడటం మానేసారు. అందుకే అక్కడ వ్యూస్ బాగానే వస్తున్నా.. టీవీలో మాత్రం టిఆర్పీ తగ్గిపోయింది.
దానికి పోటీగా ఇతర ఛానెల్స్‌లో చాలా కామెడీ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయి. ఇవన్నీ తట్టుకుని నిలబడుతుంది జబర్దస్త్ కామెడీ షో. కానీ మునపటి మ్యాజిక్ మాత్రం చేయడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా ఈ షోపై క్యాస్టింగ్ కౌచ్ ముద్ర పడుతుంది. ఈ షోలో పాల్గొనే ఫీమేల్ ఆర్టిస్ట్‌లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు లేడీ గెటప్స్ వేసేవాళ్ళు కమెడియన్లు.
కానీ ఇప్పుడు కొన్ని నెలలుగా అమ్మాయిలే వస్తున్నారు. అయితే ఈ షోలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కొందరు సీనియర్ కమెడియన్లు.. లేడీ ఆర్టిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారే వార్తలు బయటికి వస్తున్నాయి. ‘సాయంత్రం ఖాళీనా.. కలుద్దామా.. ఏంటి ప్రోగ్రామ్..’ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ఈ షోపై ప్రచారం జరుగుతుంది.
జరుగుతున్న విషయంపై షో నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా కూడా మార్పులు మాత్రం రావడం లేదని తెలుస్తుంది. పైగా నిర్వాహకులను సైతం కమెడియన్లు ఎదిరించి మాట్లాడుతున్నారని.. తీసేస్తే తీసేయ్ మాకు ఏం కాదంటూ పొగరుగా సమాధానమిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. జబర్దస్త్ లాంటి షోపై కూడా క్యాస్టింగ్ కౌచ్ ముద్ర పడితే జరిగే నష్టం దారుణంగా ఉంటుందనేది విశ్లేషకుల వాదన.