దాదాపు 8 నెలల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో విడుదలకు సిద్ధమైన సినిమా అఖండ. డిసెంబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మిర్యాల రవీందర్ రెడ్డి దాదాపు 50 కోట్లతో నిర్మించాడు.
బాలయ్య ట్రాక్ రికార్డులతో సంబంధం లేకుండా కథను బట్టి బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవడంతో ఎలా ఉండబోతుందా అనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే పూర్తైన సెన్సార్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా రొటీన్ కథతోనే వచ్చినా కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులకు తోడు బాలయ్య పర్ఫార్మెన్స్ అఖండ స్థాయిని పెంచేస్తుందని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్.
ఏపీలో టికెట్ రేట్లు తగ్గిన తర్వాత అధికారికంగా విడుదలవుతున్న పెద్ద సినిమా ఇదే. దాంతో కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో అనే విషయంపై కూడా అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ సినిమాలో పొలిటికల్ సెటైర్లు భారీగానే ఉండబోతున్నాయని తెలుస్తుంది. సాధారణంగా బాలయ్య సినిమాల్లో రాజకీయంగా సెటైర్లు బాగానే ఉంటాయి.
అఖండ సినిమాలో దీనికి సంబంధించిన సన్నివేశాలు బలంగా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ అంశాన్నే ఎక్కువగా సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో విలన్గా శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఆయన కారెక్టర్నే టార్గెట్ చేస్తూ బాలయ్య పొలిటికల్ పంచులు వేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే పోలవరం డ్యామ్ మీద వేసిన పంచ్ డైలాగ్ బానే పేలింది.