తెలుగులో ఇటీవల జానపద పాటల హవా నడుస్తోంది. పల్లెల్లో ఆనోటా.. ఈనోటా పాడుకునే పాటలు ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తున్నాయి. ‘రంగస్థలం’ సినిమాలోని ‘ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా’, ‘పలాస 1978’ సినిమాలోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’, ‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘సారంగదరియా’ వంటి పాటల కేరాఫ్ అడ్రస్ జానపదమే కావడం విశేషం.
జానపద పాటలే కాదు ఒకప్పుడు జానపద పాటలతో టీవీ షోల్లో అలరించిన ఎందరో గాయనీగాయకులు ఇప్పుడు సినిమా పాటలతో దుమ్మురేపుతున్నారు. గాయని మంగ్లీ, ఆమె చెల్లి ఇంద్రావతి చౌహాన్‌లే అందుకు ఉదాహరణ. ‘మంగ్లీ’ పలు పాటలతో తనదైన ముద్ర వేసుకుంటే, ఒకప్పుడు జానపద పాటలతో అలరించిన ఆమె చెల్లి ఇంద్రావతి పుష్పలోని ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే ఒకేఒక్క పాటతో కుర్రకారును ఉర్రూతలూగించింది.
లిరికల్ సాంగ్స్ పేరుతో ఒక్కో పాటను విడుదల చేస్తున్న ప్రస్తుత ట్రెండ్‌లో గాయనీగాయకుల వాయిస్ మాత్రమే కాదు ఆ పాట పాడుతూ వాళ్లిస్తున్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సింగర్ ఇంద్రావతి ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ లిరికల్ సాంగ్‌లో పాట పాడుతూ ఇచ్చిన హావభావాలు కుర్రకారు గుండెల్లో గుబులురేపాయనడంలో సందేహం లేదు. ఇదే ‘పుష్ప’ సినిమాలో ‘సామీ.. సామీ’ పాట కూడా బాగా పాపులర్ అయింది.
అయితే.. తమిళ్లో ఈ సాంగ్ పాడిన రాజలక్ష్మి సెంథిల్ గణేష్ హావభావాలు తమిళ్ లిరికల్ సాంగ్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఇన్‌స్టాగ్రాంలో, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఆమె ఆ పాటను ఆస్వాదిస్తూ పాడిన వీడియో క్లిప్పింగ్స్ హల్చల్ చేశాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. దీంతో.. ఈ సింగర్ ఎవరో.. ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలామందిలో ఉంది. ఈమె కూడా జానపద గాయని కావడం విశేషం.
ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరి ఇష్టం ప్రేమగా మారింది. ఆ ప్రేమ బంధాన్ని ఇద్దరూ ఏడడుగుల వైపు నడిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరిదీ ఒకే ప్రొఫెషన్ కావడంతో భార్యాభర్త కలిసి కొన్ని ‘తమిళ్ ఫోక్ మ్యూజిక్’ ఆల్బమ్స్ చేశారు. యూట్యూబ్‌లో ఆ వీడియోలు విశేష ఆదరణ పొందడంతో ఈ జంటకు విపరీతమైన క్రేజ్ దక్కింది.
2018లో విజయ్ టీవీలో ప్రసారమైన ‘సూపర్ సింగర్ 6’లో భార్యాభర్తలిద్దరూ కలిసి పాల్గొన్నారు. ఈ షోలో వీళ్ల అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సంవత్సరం.. భార్యాభర్త కలిసి ‘చార్లీ చాప్లిన్ 2’ సినిమాలో ‘Chinna Machan’ అనే పాట పాడారు. ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
అయితే.. తనకు తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ పాటే నచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. తెలుగు వెర్షన్ పాటను దాదాపు 50 సార్లు కంటే పైనే విన్నానని ఆమె చెప్పింది. లిరికల్ సాంగ్ కోసం హావభావాలు బాగా ఇచ్చారు కదా.. సినిమాల్లో నటిస్తారా అని ఆమెను అడగ్గా.. మంచి పాత్రలు తనకు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజలక్ష్మి చెప్పింది.