తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ పని కూడా పడుతున్నారు. ఇన్నాళ్లూ హిందీ సినిమా అంటే మనకు సంబంధం లేదు.. దానికి ఖాన్స్తో పాటు ఇంకా చాలా మంది హీరోలున్నారు.. మనకెందుకు అని ప్రత్యేకంగా పక్కనే ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మన సినిమాలే బాలీవుడ్లో కుమ్మేస్తున్నాయి. మన సినిమాలు అక్కడ రికార్డులు తిరగరాస్తున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇప్పుడు తమ సినిమాలతో హిందీలో కూడా చర్చనీయాంశంగా మారారు.
ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కెజియఫ్ సంచలనం కూడా మరిచిపోకూడదు. మొన్నటికి మొన్న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప సినిమా బాలీవుడ్లో అద్భుతాలు చేసింది. అక్కడ ఏకంగా 100 కోట్ల వసూళ్లు సాధించింది. అందుకే అల్లు అర్జున్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీపై కన్నేసాడు. ఇన్నాళ్లు కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. ఉత్తరాదికి వెళ్లాలని చూస్తున్నాడు. పుష్ప తర్వాత ఈయన మరింత గట్టిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
చాలా రోజుల నుంచి బన్నీ బాలీవుడ్ వెళ్లాలనుకుంటున్నాడు. కానీ టైమ్ దొరకడం లేదు.. కథ కూడా కుదరడం లేదు. కానీ ఇప్పుడు పుష్ప ఆ టైమ్ వచ్చేలా చేసింది. దీన్ని వాడుకోవాలని చూస్తున్నాడు బన్నీ. తనకు ఔట్ ఆఫ్ ది బాక్స్ ట్రై చేయాలని ఉందని చెప్పాడు బన్నీ. వీలుంటే కచ్చితంగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తానని చెబుతున్నాడు ఈయన. పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇదే ఇప్పుడు తన హిందీ సినిమాలకు పనికొస్తుందని భావిస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకు వేస్తున్నాడు అల్లు వారబ్బాయి. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వానీతో బన్నీ మాటామంతి జరిపాడని ప్రచారం జరిగింది. బాట్లా హౌజ్ లాంటి సంచలన సినిమాను తెరకెక్కించిన నిఖిల్ అద్వానీతోనే ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈయన ఇచ్చిన ఓ పార్టీ కోసం ముంబై కూడా వెళ్ళొచ్చాడు బన్నీ.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీపై చర్చ మొదలైంది. దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఓ దక్షిణాది యోధుడి జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ పీరియాడిక్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. అందులో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తుంది.