ఈ రోజుల్లో ప్రతీది బిజినెస్ అయిపోయింది. కుటుంబ సభ్యుల సమక్షంలో.. బంధు మిత్రుల ఆశీస్సులతో చేసుకోవాల్సిన పెళ్లిని కూడా బిజినెస్ కింద మార్చేస్తున్నారు కొందరు సినీ ప్రముఖులు. వాళ్లకు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకోడానికి కొన్ని మీడియా సంస్థలు కూడా కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తున్నాయి. మీ పెళ్లికి అయ్యే ఖర్చు అంతా మేం పెట్టుకుంటాం.. పై నుంచి డబ్బులు కూడా ఇస్తాం.. కాకపోతే ఆ స్ట్రీమింగ్ హక్కులు మాకివ్వండి అంటూ బేరసారాలు నడుపుతున్నాయి.
గతంలో కొందరు ప్రముఖుల పెళ్లిళ్ళ విషయంలో ఇది జరిగింది. తాజాగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి తంతులోనూ ఇదే జరగబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా కత్రినా పెళ్లి టాపిక్ బాగా వైరల్ అవుతుంది. చాలా రోజులుగా విక్కీ కౌశల్‌నే పెళ్లి చేసుకుంటుందనే వార్తలను నిజం చేస్తూ.. అతడితోనే ఏడడుగులు నడవబోతుంది ఈ భామ.
సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ లాంటి హీరోలతో ప్రేమ బెడిసికొట్టిన తర్వాత విక్కీ కౌశల్‌తో ప్రేమలో పడింది క్యాట్స్. ఏడాదిన్నరగా వీళ్ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇన్నేళ్లకు ఈ ముహూర్తం కుదిరింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ కోటలో ఈ ఇద్దరి పెళ్లి అత్యంత ఘనంగా జరగనుంది. దీనికి వచ్చే అతిథులు కూడా చాలా తక్కువగానే ఉన్నారు.
పైగా ఎన్నో ఆంక్షలు కూడా పెట్టారు. స్టేజీపైకి ఎలాంటి ఫోన్స్ తీసుకురాకూడదు.. ఫోటోలు తీయకూడదని ముందుగానే కండీషన్స్ పెట్టారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలకు, ఫోటోలకు కూడా వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. ఓ విధంగా వీడియో చానల్స్‌కు ఇది మంచి బిజినెస్. అయితే ఒక్క ఫోటో కూడా బయటికి రాకుండా ముందు నుంచి కత్రినా, విక్కీ కౌశల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుకే ఈ ఫూటేజ్ కోసం బడా మీడియా సంస్థలు కూడా గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ కోసం ఒక బడా మీడియా ఓటీటీ సంస్థ ఏకంగా 100 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఏ సెలబ్రెటీకి దక్కని స్థాయిలో కత్రినా పెళ్లికి బంపరాఫర్ రావడం గమనార్హం.