అదేంటి.. అల్లు అరవింద్‌కు ముగ్గురు కొడుకులే కదా.. నాలుగో కొడుకు కూడా ఉన్నాడా అనుకుంటున్నారా..? నిజానికి ఆయన పెద్ద కొడుకు అల్లు బాబీ గురించి కూడా చాలా మందికి మొన్నటి వరకు తెలియదు. కానీ ఆయన ఈ మధ్య బయటికి వస్తుండటంతో బాబీ పేరు కూడా తెలుస్తుంది. అయితే ఈయనకు బాబీ, బన్నీ, శిరీష్ కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు.
తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన పేరుకు నిర్మాతే కానీ హీరోలకు ఉన్న క్రేజ్ ఈయన సొంతం. ఎందుకంటే నిర్మించే సినిమాలు అలా ఉంటాయి మరి. అందుకే పోస్టర్‌పై అల్లు అరవింద్ పేరు కనిపిస్తే కచ్చితంగా హిట్ అనే గ్యారెంటీ అందరిలోనూ కనిపిస్తుంది. కమెడియన్‌గా 1000 సినిమాలకు పైగా నటించిన దివంగత లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు ఈయన.
నటుడిగా కొన్ని సినిమాలు కూడా చేసి ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయిపోయాడు అల్లు అరవింద్. ఇండస్ట్రీలో మెగా ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే బయ్యర్లకు భయం లేకుండా ఉంటుంది.. ప్రేక్షకులకు పక్కా హిట్ అనే నమ్మకం ఉంటుంది. తన బావ చిరంజీవికి ఎన్నో సలహాలు ఇస్తూ ఆయన కెరీర్‌కు అండగా నిలిచాడు అల్లు అరవింద్.
అయితే ఈ ముగ్గురు కాకుండా అల్లు అరవింద్‌కు మరొక కొడుకు కూడా ఉండేవాడు. ఆ అబ్బాయి పేరు అల్లు రాజేష్. అల్లు వెంకట్, అల్లు అర్జున్‌కి మధ్య పుట్టాడు ఈ కుర్రాడు. అయితే ఆయనకు ఏడేళ్ళ వయసున్నపుడు అల్లు రాజేష్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అది అరవింద్ దంపతులకు కడుపుకోతను మిగిల్చింది. అల్లు రాజేష్ మరణించే సమయానికి అరవింద్‌కు అల్లు అర్జున్ కూడా పుట్టాడు.
రాజేష్ మరణం తట్టుకోలేక.. భార్య తనకు ఎలాగైనా తన కొడుకు కావాలని పట్టుబట్టడంతో.. అప్పటికే చేయించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయ ఆపరేషన్ చేయించుకుని గర్భం దాల్చి అల్లు శిరీష్‌కి జన్మనిచ్చారు. శిరీష్ జన్మించిన తర్వాత తనకు పోయిన రాజేష్ మళ్లీ పుట్టాడని సంబరాలు చేసుకున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ చనిపోయిన కొడుకు గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.