సునీల్.. ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది కమెడియన్ సునీల్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీపై ఎప్పటికీ చెరిగిపోని తన నట గుర్తింపు వేసాడు ఈ భీమవరం బుల్లోడు. అందుకే సునీల్ అనగానే అతడి మొహమే ముందు మనకు గుర్తుకొస్తుంది. అయితే సునీల్ పేరుతో మరో హీరో కూడా కన్నడ ఇండస్ట్రీలో ఉండేవాడని చాలా మందికి తెలియదు. అంతేకాదు.. ఆయన కేవలం 30 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు. ఇది కూడా తెలియని విషయమే.
ఎందుకంటే మీడియా సరిగ్గా లేని రోజుల్లోనే.. కేవలం 30 ఏళ్ల వయసులో యాక్సిడెంట్లో చనిపోయాడు సునీల్. ఈయన చనిపోయే సమయానికి కన్నడ నాట స్టార్ హీరో. 1964లో జన్మించిన ఈయన.. 25 ఏళ్ళ వయసులో హీరో అయ్యాడు. 1989లో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సునీల్. అక్కడ్నుంచి ఈయన ఎదురు లేకుండా ముందుకు దూసుకుపోయాడు. కేవలం 4 ఏళ్ల సమయంలోనే 35 సినిమాలకు పైగా నటించాడు.
అందులో 90 శాతం సినిమాల్లో ఆయనే మెయిన్ హీరో. 30 సినిమాల్లో దాదాపు 20 విజయాలు అందుకున్నాడు సునీల్. ఈయన అప్రతిహత జైత్రయాత్ర చూసిన తర్వాత కన్నడ ఇండస్ట్రీకి మరో సూపర్ స్టార్ దొరికాడని అంతా పండగ చేసుకున్నారు. అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలిగిపోతున్న విష్ణువర్ధన్, అంబరీష్, శివరాజ్ కుమార్ లాంటి వాళ్లను తట్టుకుని మరీ సునీల్ నిలబడ్డాడు. చాలా చిన్న వయసులోనే వరస విజయాలు అందుకుని ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్నాడు.
1989లో బిసి రక్త సినిమాతో హీరోగా పరిచయమైన సునీల్.. ఆ తర్వాత ఎన్నో విజయాలు అందుకున్నాడు. సునీల్ మంచి అందగాడు కూడా. ఆయనకు అప్పట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. హీరోయిన్ మాలాశ్రీతో కలిసి ఎక్కువ సినిమాలు చేసాడు సునీల్. ఉన్నత స్థితిలో ఉన్నపుడే కాలం ఈయనపై కన్నెర్ర చేసింది. కేవలం 30 ఏళ్ళ వయసులోనే ఈయన ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసాడు.
1994 జులై 24న ఓ కార్యక్రమానికి హీరోయిన్ మాలా శ్రీతో కలిసి హాజరై వెనక్కి వస్తున్న సమయంలో.. వీళ్లు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో మాలా శ్రీకి తీవ్రగాయాలయ్యాయి. హీరో సునీల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హాస్పిటల్కు తరలించే లోపు.. ప్రమాదం జరిగిన గంటలోనే ప్రాణాలు కోల్పోయాడు. నెంబర్ ప్లేట్ ఉన్న ఓ లారీ ఈయన కారును ఢీ కొట్టింది.