సిద్ శ్రీరామ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. సాధారణంగా గాయకులకు అంత క్రేజ్ ఉండదు. మరీ ఎస్పీ బాలు.. యేసుదాస్.. ఏఆర్ రెహమాన్ అయితే తప్ప అప్ కమింగ్ గాయకులకు అభిమానులు ఉండటం అరుదుగా జరుగుతుంది. తాజాగా ఓ సింగర్ అలాంటి అభిమానులనే సొంతం చేసుకుంటున్నాడు. సాధారణ గాయకుడిగానే వచ్చినా కూడా.. ఇప్పుడు అసాధారణ గాయకుడు అయిపోయాడు ఆయన.
ఆయన పాట ఉంటే సినిమాకు బిజినెస్ అయిపోతుంది. అంతగా మాయ చేస్తున్నాడు ఈ కుర్ర గాయకుడు. ఈయనతో సినిమాలో ఒక్క పాట అయినా పాడించాలని కలలు కంటున్నారు సంగీత దర్శకులు. ఈయన పాడితే సినిమాకు అదే ప్లస్ అవుతుంది. ఈ మధ్య కాలంలో కేవలం సిధ్ శ్రీరామ్ పాటలను ప్రమోషన్ చేసుకుని సినిమా బిజినెస్ కూడా పూర్తి చేసారు దర్శక నిర్మాతలు.
ఈ రోజుల్లో సింగర్స్‌కు ఒక్క పాట పాడితే మహా అయితే 20 వేలు ఇస్తుంటారు.. స్టార్ సింగర్ అయితే 50 వేలు.. మరీ గొప్ప సింగర్ అయితే లక్ష అంతే. శ్రేయా ఘోషల్ లాంటి వాళ్లను తీసుకొస్తే లక్షన్నర అనుకోండి. అంతకుమించి ఇవ్వాలంటే బడ్జెట్ కూడా సహకరించదు. కానీ సిద్ శ్రీరామ్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటున్నాడు తెలుసా..?
అక్షరాలా 4.5 లక్షలు. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదే నిజమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మిగిలిన వాళ్లు లక్ష కోసం పాకులాడుతుంటే.. ఈయన మాత్రం ఒక్కో పాటకు లక్షలకు లక్షలు తీసుకుంటున్నాడు. అంతేమరి టైమ్ వచ్చింది దండుకోవాలంతే. అయినా ఈయన పాట చూపించి బిజినెస్ చేస్తున్నపుడు.. అంత డిమాండ్ చేయడంలో కూడా తప్పు లేదు కదా అంటున్నారు ఫ్యాన్స్.
చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా సిద్ శ్రీరామే కావాలంటున్నారు. అందుకే ఆయనకు అంత డిమాండ్. మొన్న విడుదలైన ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలోని పాటను కూడా ఈయనే పాడాడు. నగుమోము తారలే అంటూ సాగే ఈ పాట కూడా ఇన్స్టంట్ హిట్ అయింది. సిద్ పాడుతున్నాడంటే చాలు.. సంగీత దర్శకుడు ఎవరైనా పర్లేదు.. ట్యూన్ ఎలా ఉన్నా కూడా ఆయన గాత్రం నుంచి అమృతం జాలువారినట్లే. పాట హిట్ అయినట్లే. కేవలం ఈ కారణంతోనే అంత భారీగా పారితోషికం అందుకుంటున్నాడు సిద్ శ్రీరామ్.