అంతా అనుకున్నట్లుగానే ట్రిపుల్ ఆర్ సినిమా మరోసారి వాయిదా పడింది. జనవరి 7న రావాల్సిన ఈ చిత్రం ఎప్రిల్కు వాయిదా పడిందని తెలుస్తుంది. కొత్త డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ కచ్చితంగా సమ్మర్ రేసులోనే సినిమా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశ పడిపోయారు. నిజానికి సినిమా యూనిట్ కూడా చాలా నిరుత్సాహంలో మునిగిపోయారు. సినిమా విడుదల కోసం చిత్రయూనిట్ పడిన కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.
దాదాపు 40 కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకుంటూ.. దేశమంతా గత నెల రోజులుగా అలుపు లేకుండా.. బ్రేకులు తీసుకోకుండా తిరిగిన రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌లకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. ఉన్నట్లుండి కేసులు పెరగడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షల వైపు అడుగులు వేసాయి. ఇలాంటి సమయంలో పాన్ ఇండియన్ సినిమాను విడుదల చేసి బలి చేయడం ఇష్టం లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ వాయిదా వెనక ఇంకా చాలా కారణాలు కనిపిస్తున్నాయి.
అమెరికాలో విడుదలకు మూడు వారాల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసారు.. అక్కడ ఇప్పటికే 2.5 మిలియన్ విలువ చేసే టికెట్స్ కూడా అమ్ముడయ్యాయి. కానీ ఇఫ్పుడు ఊహించని విధంగా సినిమా వాయిదా పడింది. 2022లో కచ్చితంగా ఇండియన్ సినిమా గ్లోరీ వెనక్కి తెస్తామని చెప్పిన ట్రిపుల్ ఆర్ దర్శక నిర్మాతలు.. చివరికి వైరస్ ముందు తల వంచక తప్పలేదు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు అనుకూలమైన పరిస్థితులు లేవు.
ఏపీలో తగ్గిన టికెట్ రేట్ల వల్ల కారణంగా నిర్మాత దానయ్యను అక్కడి బయ్యర్లు ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అడిగారు.. ఆయన కూడా ఇచ్చారని తెలుస్తుంది. మరోవైపు తమిళనాడులో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయి. అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు భారీ డిస్కౌంట్ అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అమెరికాలో కూడా కొన్ని రోజులుగా భారీ కేసులు నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి.
ఇలాంటి సమయంలో సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ అయినా కూడా అనుకున్న విధంగా కలెక్షన్లు సాధించడం మాత్రం కష్టమే. అదే జరిగితే రాజమౌళికి కమర్షియల్ ఫెయిల్యూర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే వాయిదా వేసారు. జనవరి 7 న సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ పాన్ వరల్డ్ చిత్రం ఇప్పుడు అనుకూల పరిస్థితుల కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది.