జబర్దస్త్ కామెడీ షోలో ఎప్పటికప్పుడు కొత్త కమెడియన్లు వస్తూనే ఉంటారు.. వాళ్లు సత్తా చూపిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు లేడీ కమెడియన్లు ఉండేవాళ్లు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకునేవాళ్లు. వాళ్ళతోనే ఏళ్లకేళ్లు జబర్దస్త్ స్కిట్లు గడిచిపోయాయి. వాటిపై చాలా మంది మనోభావాలు కూడా దెబ్బ తిన్నాయి. లేడీ గెటప్స్ వేసుకుని నానా యాగీ చేస్తున్నారంటూ జబర్దస్త్ కమెడియన్లపై చాలా విమర్శలు వచ్చాయి. లేడీ కమెడియన్లను ఈ షోలో ఎంట్రీ ఇచ్చేవాళ్లే కాదు.
దానికి కారణం స్కిట్లో భాగంగా ఒక్కోసారి కొట్టాల్సి ఉంటుంది.. లేదంటే తిట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు అక్కడ నిజమైన అమ్మాయిలు ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని.. అబ్బాయిలే ఉండేవాళ్లు. అయితే ఈ మధ్య పరిస్థితులు మారిపోయాయి. అమ్మాయిలు కూడా బాగానే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని నెలలుగా జబర్దస్త్‌లో అబ్బాయిలకు పోటీగా అమ్మాయిలు కూడా వస్తున్నారు.
ఆమె పేరు పవిత్ర. చూడ్డానికి నాలుగు అడుగులే ఉంటుంది కానీ అమ్మాయి వేసే పంచులు మాత్రం ఆరడుగుల కంటే పైనే పేలుతున్నాయి. భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది.. ఇలా ప్రతీ టీమ్‌లోనూ కామన్‌గా కనిపిస్తుంది పవిత్ర. కొన్ని స్కిట్స్ అయితే ఈమె చుట్టూనే తిరుగుతున్నాయి. పవిత్ర పంచులకు జబర్దస్త్ స్టేజ్ అంతా అదిరిపోతుంది.
దాంతో సోషల్ మీడియాలో ఈమె ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జబర్దస్త్ ఆడియన్స్. ఈ క్రమంలోనే ఈమె టిక్ టాక్ నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. అక్కడ్నుంచే మెల్లగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ కళ్లలో పడింది. తనదైన పంచులతో అలరిస్తున్న పవిత్రతో ఇఫ్పుడు ఈటీవీ కాంట్రాక్ట్ కూడా చేయించుకుంది. ఇకపై ఈటీవీ సీరియల్స్‌లో కూడా కనిపించబోతుంది ఈ లేడీ కమెడియన్.
దానికంటే ముందు సీరియల్స్ కూడా చేసింది పవిత్ర. అయితే వాటితో రాని గుర్తింపు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోతో వచ్చింది ఈమెకు. పవిత్ర దూకుడు చూస్తుంటే చాలా రోజుల పాటు జబర్దస్త్‌లోనే పాతుకుపోయేలా కనిపిస్తుంది. మరోవైపు ఈవెంట్స్‌లో కూడా రప్ఫాడిస్తుంది పవిత్ర. ఈమె దూకుడు చూస్తుంటే కచ్చితంగా మరికొన్ని రోజుల్లో ఫైమాకు పోటీగా వచ్చేలా కనిపిస్తుంది.