విక్టరీ కొందరికి చుట్టంలా వస్తుంది.. అప్పుడప్పుడూ కానీ వచ్చెళ్లదు. కానీ ఆయనకు మాత్రం పక్కనే ఎప్పుడూ ఫ్రెండులా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విజయాన్ని ఇంటిపేరుగా మార్చుకున్న హీరో అతడు. ఆ ఒక్కడు విక్టరీ వెంకటేష్. ఒకప్పుడు ఈయన సినిమా చేస్తే చాలు విజయమే.. ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్నాడు. టాలీవుడ్లో హీరోల కొడుకులు హీరోలు కావడం పెద్ద విషయం కాదు కానీ నిర్మాత అబ్బాయిగా వచ్చి సూపర్ స్టార్ కావడం మాత్రం వెంకటేష్ ఒక్కడికే సాధ్యమైంది.
అమెరికాలో చదువుకుని.. ఇక్కడ తెలుగుపై కూడా అంత పట్టులేక ఉన్న సమయంలో కృష్ణ కోసం సిద్ధం చేసిన కథతో హీరో అయ్యాడు వెంకటేష్. 1986లో కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు వెంకీ. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ కొట్టడమే కాకుండా నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఈ అబ్బాయికి నటన వస్తుందా.. అమెరికా నుంచి వచ్చాడు తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు.. సినిమాలు చేస్తాడా.. చేసినా నిలబడతాడా అంటూ వెంకీపై అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి.
తొలి సినిమా కలియుగ పాండవులుతోనే తాను స్టార్ మెటిరియల్ అని నిరూపించుకున్నాడు వెంకీ. ఆ సినిమాలో వెంకటేష్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. అదే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఖుష్బూ పరిచయమైంది. ఆమెకు కూడా మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు వెంకటేష్. ప్రేమ, స్వర్ణకమలం, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాలతో 80ల్లో సత్తా చూపించాడు.
ఇప్పుడు కూడా వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్ 3 చేస్తున్నాడు. ఇప్పటికే రామ్‌తో మసాలా.. నాగ చైతన్యతో వెంకీ మామ లాంటి సినిమాలు చేసాడు. ఇప్పటికీ వరస సినిమాలతో స్టార్ హీరోగానే ఉన్నాడు వెంకీ. 2021లో ఓటిటిలోనే ఈయన నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు వచ్చాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి డిసెంబర్ 13తో 61వ ఏట అడుగు పెడుతున్నాడు వెంకటేష్.