నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు ప్రధాన మంత్రులను కూడా అభిమానులుగా మార్చుకున్న మేటి నటుడు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నిమ్మకూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి.. సీరియస్ పాత్రలలో నటుడిగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకొని.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న రాజేంద్ర ప్రసాద్ పుట్టిన రోజు ఈ రోజు. జులై 19, 1956న జన్మించాడు ఈయన. ఆ సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ.
కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు రాజేంద్ర ప్రసాద్. ఆయన సొంత ఊరు దొండపాడు స్వర్గీయ ఎన్టీ రామారావు పుట్టిన నిమ్మకూరుకు ఇది సమీపంలో ఉంటుంది. అందుకే ఆయన ఇంటికి తరచూ వెళ్లి వస్తూ ఉండేవాడు రాజేంద్ర ప్రసాద్. అలా చిన్నప్పటినుంచి ఆ తారక రాముడిని చూస్తూ పెరిగాడు రాజేంద్రుడు. ఒక రకం రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీకి రావడానికి ఎన్టీఆర్ కారణం. ఆయన ప్రోత్సాహంతోనే నటుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు ఈ సీనియర్ హీరో.
సీనియర్ ఎన్టీఆర్తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై రాజేంద్రప్రసాద్ ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించాడు. తన దగ్గరికి వచ్చినపుడు రాజేంద్ర ప్రసాద్ లోని నటనపై ఆసక్తిని గమనించిన సీనియర్ ఎన్టీఆర్.. నటుడిగా మారాలని సలహా ఇచ్చాడు. ఆయన సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించాడు రాజేంద్ర ప్రసాద్. ఇండస్ట్రీకి వచ్చే ముందు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశాడు ఈయన. ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా కూడా నటుడిగా మారిపోయాడు రాజేంద్రప్రసాద్.
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తొలి అవకాశం కోసం చాలా మంది కష్టపడుతుంటారు. కానీ రాజేంద్రుడికి మాత్రం అలాంటి సినిమా కష్టాలేం రాలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగానే దొరికేసింది. ఫిల్మ్ ఇన్స్ట్యూట్ నుంచి బయటికి వచ్చిన వెంటనే బాపు లాంటి లెజెండరీ దర్శకుడితో పని చేసే అవకాశం అందుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఈయన తొలి చిత్రం స్నేహం. బాపు తెరకెక్కించిన ఈ సినిమా 1977 సెప్టెంబరు 5న విడుదలైంది. ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో వచ్చిన మంచు పల్లకి సినిమాలో నటించాడు. ఇందులో చిరంజీవి హీరోగా నటించాడు. అలాగే దర్శకుడు వంశీకి తొలి సినిమా ఇది.
కెరీర్ మొదట్లోనే మంచి సినిమాలు చేసాడు రాజేంద్ర ప్రసాద్. నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన పాత్రల్లోనే ఎక్కువగా కనిపించాడు. అప్పటికి కామెడీ వైపు ఆయన వెళ్లలేదు. వరసగా సీరియస్ పాత్రలతోనే అలరించాడు రాజేంద్రుడు. ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. అందులో కొన్ని విలన్ కూడా ఉన్నాయి. దాంతో పాటు అన్నా, తమ్ముడు లాంటి పాత్రల్లోనూ మెప్పించాడు రాజేంద్ర ప్రసాద్. కాష్మోరా లాంటి సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ నటన చూసి అంతా ఆశ్చర్యపోయారు.
అప్పటి వరకు సీరియస్ పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న రాజేంద్ర ప్రసాద్ ను హాస్యం వైపు తిరిగేలా చేసింది జంధ్యాల. ఈయనలోని హాస్యాన్నే పూర్తిగా పిండుకున్నాడు జంధ్యాల. అహ నా పెళ్లంట సినిమా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా హిస్టరీలోనే బెస్ట్ కామెడీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ లోని కామెడీ నటుడిని మిగిలిన దర్శకులు కూడా తెగ వాడేసుకున్నారు. అందులో రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు ఉన్నారు. బాపు లాంటి అగ్ర దర్శకుడు కూడా రాజేంద్ర ప్రసాద్ లోని నటుడితో పాటు కమెడియన్ ను కూడా బాగా వాడుకున్నారు. మిస్టర్ పెళ్ళాం సినిమానే దీనికి నిదర్శనం.
తెలుగు ఇండస్ట్రీకి అడుగులు వేసిన తొలి నాళ్లలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. అంతేకాదు.. సీనియర్ నటులు అందరితోనూ కలిసి నటించాడు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తున్న సమయంలోనూ.. కథ నచ్చితే సపోర్టింగ్ కారెక్టర్స్ చేసాడు రాజేంద్ర ప్రసాద్. తెలుగులోనే కాకుండా హాలీవుడ్ లో క్విక్ గన్ మురుగన్ అనే సినిమాలో నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ సినిమాకు అవార్డు కూడా వచ్చింది.
1987లో విడుదలైన అహ నా పెళ్లంట తర్వాత రాజేంద్ ప్రసాద్ కెరీర్ కు స్వర్ణయుగం మొదలైంది. అప్పట్నుంచి ఈయన చేసిన కామెడీ సినిమాలు తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసాయి. అప్పటి వరకు హీరోలు ఫైట్స్ చేయాలి.. కమెడియన్లు వచ్చి నవ్వించాలనే ఆనవాయితీకి బ్రేక్ చెప్పాడు రాజేంద్రుడు. హీరోనే కామెడీ చేయొచ్చని నిరూపించాడు. సినిమా అంతా కామెడీతోనే నడిపించొచ్చని రాజేంద్ర ప్రసాద్ సినిమాలు నిరూపించాయి. 90ల్లో ఈయన నటించిన ఎప్రిల్ 1 విడుదల, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, కొబ్బరి బొండాం, పెళ్లి చేసి చూడు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఆ ఒక్కటి అడక్కు లాంటి ఎన్నో సంచలన సినిమాలు రాజేంద్ర ప్రసాద్ రేంజ్ ఏంటో చూపించాయి.
ఒకానొక సమయంలో కాస్త నవ్వుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తే చాలు అని ప్రేక్షకులలో నమ్మకం కలిగించాడు ఈయన. ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు రాజేంద్రుడు. ముఖ్యంగా రేలంగి నరసింహారావు, జంద్యాల, ఈవీవీ అయితే రాజేంద్ర ప్రసాద్ ఇమేజ్ పెంచడంలో బాగా సాయపడ్డారు. అలాగే దర్శకులుగా వాళ్ల స్థాయి కూడా పెంచుకున్నారు. జోకర్, మిస్టర్ పెళ్లాం, పెళ్లి పుస్తకం లాంటి సినిమాలలో కామెడీతో పాటు మనసును కరిగించే ఎమోషనల్ సీన్స్ కూడా పండించాడు రాజేంద్ ప్రసాద్. ముఖ్యంగా జోకర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ లోని అసలైన నటుడిని బయటికి తీసుకొచ్చింది.
90ల్లో సోలో హీరోగా రప్ఫాడించిన రాజేంద్ర ప్రసాద్.. 2000 తర్వాత రూటు మార్చాడు. ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడే సందడి, శ్రీ రామచంద్రులు లాంటి సినిమాల్లో రాజేంద్రుడి కామెడీ టైమింగ్ అదుర్స్ అంతే. అలాంటి సమయంలోనే ఈయన నటించిన ఆ నలుగురు సినిమా ఓ సంచలనం. అప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ ను కేవలం కామెడీ పాత్రల్లో మాత్రమే చూడటం అలవాటైన ప్రేక్షకులకు ఆ నలుగురు చాలా ఏళ్ళ తర్వాత రాజేంద్ర ప్రసాద్ లోని మరో స్థాయి నటుడిగా పరిచయం చేసింది. చంద్రమహేష్ తెరకెక్కించిన ఈ చిత్రంతో నటుడిగా బంగారు నందిని సొంతం చేసుకున్నాడు ఈయన.
గత 10-15 ఏళ్ళలో కూడా రాజేంద్ర ప్రసాద్ గుర్తుండిపోయే పాత్రలు చేసాడు. జులాయి సినిమాలో ఈయన పోషించిన పోలీస్ పాత్ర తలుచుకున్నపుడల్లా నవ్వు తెప్పిస్తుంది. మీ శ్రేయోభిలాషిలో ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పే రాజాజీ పాత్ర గుర్తుకు వచ్చినపుడల్లా ఏడిపిస్తుంది. నవ్వించేవాడికే ఏడిపించే సత్తా కూడా ఉంటుందని బ్రహ్మానందం చెప్పిన మాటలకు తెరరూపం రాజేంద్ర ప్రసాద్ నటన. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే సత్తా ఉన్న నటుడు ఈయన. మొన్నటి ఎఫ్ 2 సినిమాలోనూ ఈయన చేసిన కామెడీకి కడుపులు చెక్కలవుతాయి. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్.
సినిమాలు మాత్రమే కాదు.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు ఏప్రిల్, 2015 లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్ ఘనవిజయం సాధించాడు. ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్, జయసుధలు అధ్యక్ష పదవికి పోటీపడగా తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడిన ఫలితాలు జయసుధ, మురళీమోహన్ లకు షాక్ నిచ్చాయి. జయసుధ గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికీ రాజేంద్రప్రసాద్ గెలుపు అనూహ్యంగా తోచింది. రాజేంద్రప్రసాద్ 83 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాజేంద్రుడి ప్యానల్ లోని శివాజీ రాజా, కాదంబరి కిరణ్ కూడా గెలుపొందారు. అప్పట్నుంచే మా ఎన్నికల్లో వేడి రాజుకోవడం మొదలయ్యాయి.
200 సినిమాలకు పైగానే నటించిన రాజేంద్ర ప్రసాద్.. అవార్డుల పరంగానూ ముందే ఉన్నాడు. ఎర్ర మందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు ఈయన. 1991లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత మేడమ్ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇది 1994లో విడుదలైంది. 2004లో విడుదలైన ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఈయన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. రాజేంద్ర ప్రసాద్ కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం..