మెగా కుటుంబం అనేది ఓ మహావృక్షం. అందులో చాలా మంది హీరోలు ఉన్నారు. ఎవరికి వాళ్లు సొంతంగా మార్కెట్ సంపాదించుకున్నారు. అక్కడ్నుంచి వచ్చి తమకంటూ గుర్తింపు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎవరి ప్రభావం మీద పడకుండా.. సొంత గుర్తింపు ఉంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారు. మరోవైపు మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు కాస్త అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కష్టపడితే ఇమేజ్‌తో పాటు మార్కెట్ కూడా వచ్చేస్తుంది.
అందుకే వచ్చిన ప్రతీ హీరో దాదాపు సక్సెస్ అవుతుంటాడు. అందులో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. నాగబాబు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. మొదట్లో కాస్త కంగారు పడినట్లు అనిపించినా.. ఇప్పుడు దూసుకుపోతున్నాడు. జనవరి 19 ఈయన పుట్టిన రోజు. దాంతో అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు. వరస విజయాలతో ఇండస్ట్రీలో తన కెరీర్‌కు కావాల్సిన పునాది వేసుకున్నాడు.
2014లో ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం పర్లేదు అనిపించింది. మొదటి సినిమాతోనే డిఫెరెంట్ అటెంప్ట్ చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఇక రెండో సినిమా క్రిష్‌తో కంచె చేసాడు వరుణ్ తేజ్. విభిన్నమైన కథలు చేసే క్రిష్.. వరుణ్ తేజ్‌తో కూడా రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కంచె సినిమా చేసాడు.
ఈ సినిమా అవార్డులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంది. అందులో వరుణ్ తేజ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. మధ్యలో పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల లాంటి స్టార్ డైరెక్టర్స్‌తో లోఫర్, మిస్టర్ లాంటి సినిమాలు చేసినా వర్కవుట్ కాలేదు. అలాంటి సమయంలో వచ్చిన తొలి ప్రేమ వరుణ్ తేజ్ కోరుకున్న సోలో విజయాన్ని అందించింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈయన నటించిన ఫిదా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 48 కోట్లు వసూలు చేసింది. వరుణ్ తేజ్ మార్కెట్ పెరగడంలో ఫిదా పాత్ర కూడా కీలకమే. అయితే ఈ చిత్రం హిట్టైనా.. అందులో ఎక్కువ భాగం క్రెడిట్ సాయి పల్లవికి వెళ్లిపోయింది. ఆమె వల్లే సినిమా ఆడిందంటూ ఫ్యాన్స్ ఇప్పటికీ చెప్తుంటారు.
ఆ సినిమా తర్వాత వరుణ్ కెరీర్ జోరు మీదుంది. వెంకటేష్‌తో కలిసి నటించిన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సీక్వెల్ ఎఫ్ 3లో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ మెగా ప్రిన్స్‌లోని మరో కోణాన్ని బయటికి తీసింది.