ఈ నెంబర్ 1.. నెంబర్ 2 గేమ్స్ మన దగ్గర నడవవు.. నేను సపరేట్.. ఓన్లీ వన్ పీస్.. సూపర్ వన్.. ఇది 2.0లో రజినీకాంత్ తన గురించి తాను చెప్పుకున్న మాట. ఇదే డైలాగ్ వేరే వాళ్లు చెబితే నవ్వుకుంటారేమో కానీ రజినీకాంత్ చెబితే మాత్రం ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే అది అక్షర సత్యం కూడా. ఎందుకంటే ఆయన దూకుడు అలా ఉంటుంది మరి. 46 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సృష్టించుకుని.. 71 కి చేరువవుతున్న సమయంలో కూడా ఇప్పటికీ సూపర్ స్టార్‌గా ఉంటూ రికార్డులు తిరగరాస్తున్న రజినీకాంత్ ఛరిష్మా గురించి ఏం చెప్పాలి..?
ఈ హీరో డిసెంబర్ 12న 71వ ఏట అడుగు పెడుతున్నాడు. ఆయన నడిస్తే స్టైల్.. కూర్చుంటే స్టైల్.. మాట్లాడితే స్టైల్.. సిగరెట్ తాగితే స్టైల్.. అలా పక్కకు చూసినా స్టైల్.. ఒక్కటేమిటి ఏం చేసినా.. ఎలా చేసినా స్టైల్ స్టైల్ స్టైల్. అసలు స్టైల్ అనే మాట ఆయన్ని చూసి పుట్టిందేమో మరి.. లేదంటే ఆయన కోసమే పుట్టిందేమో అన్నట్లుగా ఉంటుంది రజినిని చూస్తుంటే. 1950లో ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన శివాజీ రావ్ గైక్వాడ్.. ఆ తర్వాత రజినీకాంత్‌గా మారాడు.
కర్ణాటకలో తన బతుకుయానం మొదలుపెట్టాడు. అక్కడే కొన్నేళ్లు కండక్టర్‌గా పనిచేసాడు. టికెట్స్ ఇస్తున్నపుడు తతన స్టైల్ చూసి ఓ స్నేహితుడు సినిమాల్లో ట్రై చేయంటే అలా మద్రాస్ వచ్చి అక్కడ నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. 1975 లో బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాతో తొలిసారి తమిళ సినిమాకు పరిచయం అయ్యారు. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ చిత్రం.
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించారు రజినీకాంత్. 70వ దశకం చివర్లో విలన్‌గా నటించిన రజినీ.. 80ల్లోకి వచ్చేసరికి హీరో అయ్యారు. ముఖ్యంగా బిల్లా సినిమా ఆయన్ని స్టార్ గా మార్చేసింది. అప్పట్నుంచి రజినీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మాస్ హీరో అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయాడు రజినీకాంత్. అప్పటికే కమల్ హాసన్ క్లాస్ సినిమాలతో కుమ్మేస్తుంటే.. ఎంజిఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోల నుంచి పోటీ తట్టుకుని.. వాళ్లను దాటుకుని మాస్ హీరో అయ్యాడు రజినీకాంత్.
చరిత్ర చెప్పుకునే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను 80ల్లో ఇచ్చాడు రజినీకాంత్. కేవలం తమిళ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసాడు. హిందీలోనూ విజయాలు అందుకున్నాడు. ఇక 90వ దశకంలో పూర్తిగా తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసాడు. అక్కడ తన స్టామినా చూపించాడు. 90వ దశకం అంతా సూపర్ స్టార్‌కు స్వర్ణయుగమే. మాప్పిళ్లై.. బాషా.. ముత్తు.. పడయప్పా.. లాంటి ఎన్నో సంచలనాత్మక సినిమాలతో ఇండియన్ రికార్డులను సైతం కుదిపేసాడు రజినీకాంత్.
మిలీనియం మొదలైన తర్వాత రజినీ జోరు కాస్త తగ్గింది. బాబాతో వెనకబడినా.. 2005లో చంద్రముఖితో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రజినీకాంత్. ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న తమిళ సినిమా రికార్డులన్నింటినీ తుడిచేసింది. ఆ తర్వాత శివాజీ.. రోబో లాంటి సినిమాలు రజినీ స్టామినా ఏంటో తెలియజేసాయి. కబాలి యావరేజ్ టాక్‌తోనే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కాలాతో ఫ్లాప్ ఇచ్చినా కూడా 2.0తో 500 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి సూపర్ స్టార్ స్టామినా ఏంటో చూపించాడు.
అయితే ఈ చిత్రం కమర్షిలయ్ ఫ్లాప్ అయింది. 2.0 తర్వాత వచ్చిన పేట, దర్బార్.. మొన్నటికి మొన్న విడుదలైన పెద్దన్న సినిమాలు కూడా అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యాయి. ఈ మధ్య అనారోగ్యం కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మధ్యలో రాజకీయ అరంగేట్రం చేస్తానంటూ మాటిచ్చి.. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆ మాట నుంచి విరమించుకున్నాడు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. మీరు రాజకీయాలు చేయకపోయినా పర్లేదు కానీ ఆరోగ్యంగా ఉంటే చాలు అంటున్నారు.
గతేడాది కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే కూడా అందుకున్నాడు రజనీకాంత్. 2000లోనే పద్బభూషణ్ అందుకున్న ఈయన.. 2016లో పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. ఎన్నో అవార్డులు.. మరెన్నో రికార్డులు.. ఇంకెన్నో సంచలనాలు సృష్టించిన రజినీ ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.