సినీ పాటల తోటలో కోయిలను మరిపించిన సుమధుర వాణి. పాటలతల్లి తన పాదాలను దిద్దుకున్న సప్తస్వరాల పారాణి. ఆమె స్వరం స్వరరాగ గంగాప్రవాహం. ఆమె గళం ఉరికే జలపాతం. అది యుగళగీతమైనా.... భక్తిగీతమైనా... జానపదమైనా...ఆ గొంతులో అలవోకగా సాగాల్సిందే. ఎటువంటి సాహిత్యానికైనా తన గాత్రంతో పట్టం కట్టిన గానకోకిల. దక్షిణభారతాన్ని తన గానామృతంతో మైమరిపిస్తున్న ఆ స్వరగీతికే పి.సుశీల. ఈ మెలోడి క్వీన్ బర్త్ డే. (Twitter/Photo)
గానకోకిల సుశీల ఈరోజు తన 86వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. దక్షిణాది సినీ సంగీత సామ్రాజ్యాన్ని.. నాలుగు దశాబ్దాలు పాటు పాలించిన స్వర రాణి సుశీల. సందర్భం ఏదైనా...సన్నివేశం మరేదైనా...ఆమె స్వరంలో జాలువారుతాయి. ఆమె గొంతులో ఉండే తియ్యదనం... విన్న శ్రోతల మనసుల్ని మాత్రం మధురిమలతో నింపేస్తుంది. సౌతిండియన్ నైటింగేల్ గా పేరొందిన సుశీల గాన మాధుర్యాన్ని ఒకసారి ఆస్వాదించుకుందాం... Photo : Twitter
సంగీతాభిమానులకు పరిచయంల అక్కర్లేని పేరు సుశీల. దక్షిణాది గానకోకిలగా ఫేమస్ అయిన సుశీలమ్మ.... 1935 నవంబర్ 13న...విజయనగరంలో ఒక సంపన్నకుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులిద్దరికీ సంగీతం అంటే ప్రాణం. యం.యస్.సుబ్బలక్ష్మి అంతటి గాయనిని చేయాలదే ఆమె తండ్రి కోరిక. దాంతో చిన్నప్పుడే ద్వారంపూడి వెంకటస్వామి నాయుడు వద్ద శాస్త్రీయ సంగీతం నేర్పించారు. Photo : Twitter
ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవారు. తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా రాణించారు. చిన్నప్పటి నుంచి సుశీలకు శాస్త్రీయ సంగీతం కన్నా...సినిమా పాటలపై మోజు ఎక్కువగా ఉండేది. లతా మంగేష్కర్, జిక్కి, భానుమతి వంటి గాయనీ మణుల పాటలను వింటూ ప్రాక్టీస్ చేస్తుండేది. దాంతో పాటు విజయనగరం మహారాజ కళాశాలలో సంగీతంలో డిప్లోమా పూర్తి చేసింది. ఆ తర్వాత సంగీత విద్వాన్ కోర్సు కోసం మద్రాసుకు మకాం మార్చారు. ఆ నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. చిత్రపరిశ్రమకు చేరువగా ఉండటంతో.. సినిమా రంగంలో అడుగు పెట్టెందుకు మార్గం సులువైంది. Photo : Twitter
మొదట్లో ఆలిండియా రేడియోలో ఆలపించేది సుశీల. ఆమె లోని గానమాధుర్యాన్ని గుర్తించిన ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల ..కన్నతల్లి అనే తెలుగు సినిమాలో పాడే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. పెండ్యాల నుంచి ఇప్పటి ఏ.ఆర్.రహమాన్ వరకు ఎందరో గొప్ప సంగీత దర్శకులు ఆమె గాత్రాన్ని సంగీతాభిమానులకు చేరువ చేసారు. చిరకాలం నిలిచిపోయే పాటలనిచ్చారు.. (Twitter/Photo)
ఒకే సినిమాలో పండుముసలికి...పాలుగారే పాపాయికి పాడి మెప్పించిన ఘనత సుశీలది. ఏ వయసు వారికైనా సరిపోయే గళాన్నిస్తుంది. పాటల్ని భావ గర్భితంగా పాడటంలో సుశీలను మించిన వారు లేరు. ఇక చిన్పపిల్లలకు పాడటంలో సుశీల శైలే వేరు. చిన్నపిల్లల పాటలకు ఆమె స్పెషలిస్ట్ గా పేరుగడించారు. సుశీల.. ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకుంది. ఆమె తన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తులు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడింది. Photo : Twitter
సుశీలకు కోరస్ సింగర్ గా తొలి అవకాశం లభించింది. 1953లో విడుదలైన కన్నతల్లి సినిమాలో ఒక పాటలో ఆమె కోరస్ పాడారు. దానికీ పెండ్యాల సంగీత దర్శకత్వం వహించారు. ఆ పాట పాడుతున్న సమయంలోనే ఆమె గాత్రానికీ ముగ్ధుదైన సౌండ్ ఇంజనీర్ నాగరాజు ఆమె గురించి ఏవిఎమ్ సంస్థ అధినేతకు గొప్పగా చెప్పారు. దాంతో వెంటనే సుశీలను ఏవిఎమ్ సంస్థ స్టాఫ్ సింగర్ గా సెలక్ట్ చేసింది. ఏవిఎమ్ సంస్థలో కోరస్ పాటలు పాడిన సుశీలకు... అనుకోకుండా ప్రధాన గాయినిగా అవకాశం లభించింది. ఏవిఎమ్ స్టూడియోలో ఆమె పాడుతున్నతీరు చూసి.... ముచ్చటపడ్డాడు ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి. అక్కినేని, సావిత్రి, జమునలతో తాను తీయబోయే దొంగరాముడు సినిమాలో అవకాశం ఇచ్చారు. అందులో మూడు పాటలు పాడిన సుశీలకు మంచి గుర్తింపు వచ్చింది. (Twitter/Photo)
దొంగరాముడు పాటలు రికార్డింగ్ సమయంలోనే సుశీల గాత్రం విన్న విజయాధినేతలు తన నెక్ట్స్ పిక్చర్ మిస్సమ్మలో పాడించారు. మిస్సమ్మలో బృందావన మది అందరిదీ అనే పాట పాడి మురిపించింది. క్రమంగా సుశీలకు అవకాశాలు పెరిగాయి. ఒకేసారి తెలుగు, తమిళంలోను పాడటం ప్రారంభించారు. తొలినాళ్లలో ఆమె గొంతు పీలగా ఉందని విమర్శకులు ఆమెను నిరుత్సాహపరిచారు. అయినా.. వారందరీ విమర్శలకు తన గానంతోనే సమాధానం ఇచ్చిందామె .భాష ఏదయినా స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు. సుశీలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. అత్యధిక సంఖ్యలో సోలో పాటలు పాడినందుకు ఆమెకీ ఈ గౌరవం లభించింది. Photo : Twitter
కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎక్కువగా సెకండ్ హీరోయిన్ లకు మాత్రమే ..పాడే అవకాశాలు వచ్చేవి. ఆ తర్వాత తోడికోడళ్లు సినిమాతో సింగర్ గా సుశీల దశ తిరిగింది. మాయాబజార్ సినిమాలో సావిత్రి పాత్రకు పాడిన.. అహనాపెళ్లంట పాటతో .. ఆమె కెరీర్ ఊపందుకుంది. మాంగల్యబలం, జయభేరి, అప్పుచేసిపప్పుకూడు, శభాష్ రాముడు, ఇల్లరికం, ఆత్మబలం వంటి తెలుగు చిత్రాల్లోఆమె పాడిన పాటలు ప్రజాదరణ పొందాయి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఐదేళ్లకే తెలుగు,తమిళ భాషల్లో ప్రధాన గాయనిగా మారారు సుశీల. (Twitter/Photo)
అప్పటివరకు ఘంటసాలతో కలిసి లీల వంటి గాయనీమణులే ఎక్కువగా యుగళ గీతాలు పాడేవారు. సుశీల రాకతో సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న లీల, జిక్కి వంటి గాయనీమణుల ప్రాభవం తగ్గిపోయింది. ఘంటసాల, సుశీల కాంబినేషన్ కు క్రేజ్ పెరిగింది. 1960 నుంచి అంతా సుశీల స్వర స్వర్ణయుగమే నడిచింది. 60 వ దశకం మొత్తం సుశీల పాటలే తెలుగునాట మారుమోగాయి. ఆ డెకేడ్ లో వచ్చిన రక్తసంబంధం, పునర్జన్మ, మూగమనుసులు, ఆరాధన, గుండమ్మకథ, వెలుగునీడలు, డాక్టర్ చక్రవర్తి .. ఇలా అన్ని సినిమాల్లో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మూడు దశాబ్ధాలపాటు తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని స్వరశక్తిగా నిలిచి శతాబ్ది గాయనిగా కీర్తి గడించారు సుశీల. తెలుగుపాటకు పర్యాయ పదంగా నిలిచిన గాయనీ మణి. అందుకే ఆమె పాట ప్రతినోటా.. అనేవిధంగా అందరూ పాడుకునేలా చేసింది. (Twitter/Photo)
ఆనాటి గొప్ప సంగీత దర్శకులైనా...పెండ్యాల, సుసర్ల, సాలూరి, ఆదినారాయణరావు, కె.వి.మహదేవన్, సత్యం, యం.యస్.విశ్వనాథన్ వంటివారంతా సుశీలతోనే పాడించేవారు. అలాగే ఘంటసాల కూడా తన సంగీత దర్శకత్వంలో పాటలన్ని ఆమెకే ఇచ్చేవారు. అది సుశీల మార్క్ గొప్పతనం. ఘంటసాల, సుశీల కాంబినేషన్ తర్వాత 70వ దశకంలో.. బాలుతో ఆమె కాంబినేషన్ కు మంచి పేరొచ్చింది. (Twitter/Photo)
మారిన తెలుగు సినిమా శైలికి తగ్గట్టు ఆమె పాటలు పాడారు. కమర్షియల్ సినిమాల పంథాకి సరిపోయే పాటలను అద్భుతంగా ఆలపించి తిరుగులేని గాయనిగా ఎదిగారు సుశీల. 1960 నుంచి 80ల వరకు కథానాయికలకు పాటంటే సుశీల పాడాలనే భావన ఉండేది. అగ్ర హీరోయిన్లకు, ముఖ్యమైన పాటలకు సంగీత దర్శకుల ఫస్ట్ ఛాయిస్ సుశీలే. మధురమైన పాటలకు శాస్త్రీయ సంగీత ఛాయలున్న గీతాలకు ఆమె గాత్రమే పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి.(Twitter/Photo)
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా..దక్షిణాది చిత్ర సీమను సుశీలమ్మ తిరుగులేని గాయినిగా ఏలారు. గాయకుల్లో ఘంటసాలకు ఎంత ఫాలోయింగ్ ఉందో ...గాయనీమణుల్లో సుశీలమ్మకు అంతే ఫాలోయింగ్ ఉంది. నేటి తరం గాయనీగాయకులకు ఆమె పాటే పెద్దబాలశిక్ష. ఇక 80లలో చక్రవర్తి, కె.వి.మహదేవన్, రమేష్ నాయుడు వంటి వారు సుశీలతోనే పాడించేవారు. ఆ తర్వాత ఆమె ప్రాభవం తగ్గుతూ వచ్చింది. అయినా ఆమె పాటలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
సుశీల గాన మాధుర్యానికి ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఐదు సార్లు జాతీయఅవార్డులు అందుకున్న గాయనీ మణిగా రికార్డు సృష్టించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయనిగా ఆరు నందులు ఆమెను వరించాయి. అలాగే వివిధ స్టేట్ గవర్నమెంట్ అవార్డులు ఆమె ప్రతిభను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు.... తమిళ నాడు గవర్నమెంటు నుంచి కలైమామణి వంటి పురస్కారాలు ఆమెను వరించాయి. 2008లో కేంద్రం ఆమె ప్రతిభను గుర్తించి పద్మభూషణ్ తో గౌరవించింది. (Twitter/Photo)
సుశీల మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలదు. తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా ఆమె మాట్లాడగలదు. మధురంగా పాడటంలోను... వైవిధ్యం ప్రదర్శించడంలోను... శాస్త్రీయ సంగీత గమకాలను చక్కగా ఆలపించడంలోను సుశీలకు సాటి మరెవరు లేరన్న ఖ్యాతి సంపాదించింది. నైటింగేల్ ఆఫ్ సౌతిండియా పేరు సంపాదించిన సుశీలగారికి న్యూస్ 18 బర్త్ డే విషెస్ చెబుతోంది. (Twitter/Photo)