ఆయన గానం స్వరరాగ గంగా ప్రవాహం. ఆయన పాడుతుంటే.. దేవతలు సైతం తన్మయత్వం పొందుతారనే పేరుంది. శబరిమలలో హరివరాసనం అంటూ ఆయన పాడే జోల పాటతోనే అయ్యప్ప స్వామికి నిత్యం పవళింపు సేవ చేస్తారు. అంతలా తన గానంతో ఆ సేతు హిమాచలం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన గాయకుల్లో కేజే యేసుదాసు ముందు వరసలో ఉంటారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన స్వరరాగ ప్రస్థానంలో కొన్ని కీలక ఘట్టాలు. (Twitter/Photo)
యేసుదాసు దాదాపు ఆరు దశాబ్దాల సినీ కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేలకు పైగా పాటలను పాడారు. ఆయన్ని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అంతేకాదు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్లలో ఈయన ఒకరు. (Twitter/Photo)
మొదట గాయకుడిగా ఆయన గొంతు పనికాదన్న వారే ఆయన గొంతులో పలికే రాగాల కోసం వేచి ఉండేలా చేసారు. యేసుదాసు తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత గాయకుడు. అంతేకాదు ప్రముఖ రంగస్థల నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐనా.. వారికి ఆర్టిక ఇబ్బందులు తప్పేవి కావు. యేసుదాసు ఐదుగురు సంతానంలో పెద్దవాడు, అతని తరువాత ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. తండ్రి ప్రభావంతో ఏసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవారు పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపుణిత్తుర లోని ఆర్.ఎల్.వి. సంగీత కళాశాలలో చేర్పించారు.
ఆ తర్వాత యేసుదాసు చెంబయ్ వైద్యనాథ భాగవతార్ వద్ద కూడా సంగీతంలో విద్యను అభ్యసించారు. ఆయన దగ్గర సంగీతం రాటు తేలాకా.. 1961 నవంబరు 14 న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు గాయకుడిగా మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారు. యేసుదాసు పాటలలో మొదటి ప్రసిద్ధ పాట "జాతి భేదం మత ద్వేషం" 1961 నవంబరు 14న రికార్డు చేయబడింది. (Twitter/Photo)
నట ప్రపూర్ణ మోహన్ బాబుతో యేసుదాసుకు ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగులో ఈయన ఎక్కువగా మోహన్ బాబు సినిమాలకు పాటలు పాడారు. మోహన్ బాబు సినిమా అంటే ఖచ్చితంగా ఓ పాట యేసుదాసుది ఉండాల్సిందే. మోహన్ బాబు పాటలకు యేసుదాసు గాత్రం అతికినట్టు సరిపోతుందనే వాదన ఉంది. ముఖ్యంగా అల్లుడు గారులో ‘కొండలలో నెలకొన్న, అసెంబ్లీ రౌడీలో ‘అందమైన వెన్నెలలోనా’ , బ్రహ్మలో ‘ముసి ముసి నవ్వులోనా’ వంటి పాటలు యేసుదాసు మోహన్ బాబుకు పాడటం విశేషం. ఈ పాటలు యేసుదాసు గాత్రంతో ఎక్కడో వెళ్లాయి. (Twitter/Photo)
సినీ ప్రస్థానంలో కే.జే.యేసుదాసు.. మలయాళ, తెలుగు, హిందీలో కలిపి మొత్తంగా 8 జాతీయ అవార్డులు అందుకొని రికార్డు నెలకొల్పారు. మన దేశంలో ఓ గాయకుడు మూడు భాషల్లో 8 జాతీయ అవార్డులు అందుకున్న వారు ఎవరు లేరు. ఈయన తర్వాత బాలు గారు నాలుగు భాషల్లో ఆరు జాతీయ అవార్డులతో రెండో స్థానంలో ఉన్నారు. (Twitter/Photo)
కే.జే.యేసుదాసుకు వరించిన అవార్డులకు రివార్డులకు కొదవే లేదు. ఈయన కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 26 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరుపున బెస్ట్ సింగర్‌గా నాలుగు నందులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయకుడిగా ఐదు పురస్కారాలు కైవసం చేసుకున్నారు. (Twitter/Photo)